Chandrababu: బీజేపీ చేతిలో చిక్కుకుని.. ఇప్పుడు మహాకూటమిపై బాధపడితే ఎలా?: కేసీఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు

  • టీఆర్ఎస్ కు స్నేహ హస్తం అందించా
  • మోదీ అడ్డు పడటంతో టీఆర్ఎస్ ముందుకు రాలేదు
  • బీజేపీ చేతిలో పావుగా మారి.. కేసులతో ఇబ్బంది పెట్టాలనుకున్నారు

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఢిల్లీలో మన పలుకుబడి తగ్గిపోయిందని... దీంతో, ఇరు తెలుగు రాష్ట్రాలు ఒకే తాటిపై వెళ్తే తెలుగువారి ప్రాముఖ్యత సుస్థిరంగా ఉంటుందని తాను భావించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నించిందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేసీఆర్ కలసి రాలేదని... అయినా వీటన్నింటినీ పక్కన పెట్టి టీఆర్ఎస్ కు స్నేహ హస్తం అందించానని చెప్పారు. ప్రధాని మోదీ అడ్డుపడటంతో టీఆర్ఎస్ ముందుకు రాలేదని తెలిపారు.

బీజేపీ చేతిలో పావుగా మారి, కేసులతో ఇబ్బంది పెట్టాలని భావించారని చంద్రబాబు విమర్శించారు. తొలుత ఈడీని రంగంలోకి దించాలని అనుకున్నా, అది వీలుకాకపోవడంతో చివరకు ఐటీని రంగంలోకి దించారని చెప్పారు. వాళ్లను ఏమైనా చేసుకోనివ్వండని... తాము దేనికైనా సిద్ధంగానే ఉన్నామని అన్నారు. కలసి వెళ్దామని కేసీఆర్ ను కోరితే... ఆయన కాదన్నారని చెప్పారు. తాను సూచించిన విధంగా కేసీఆర్ ముందడుగు వేసి ఉంటే... ఈరోజు తెలంగాణలో మహాకూటమి ఏర్పడేది కాదని అన్నారు. మిగిలిన పార్టీలు కూడా కలిసేవి కాదని చెప్పారు. బీజేపీ చేతిలో చిక్కుకుని, ఇప్పుడు మహాకూటమిపై బాధపడితే ఎలాగని ప్రశ్నించారు.

More Telugu News