Donald Trump: సౌదీ రాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

  • ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే మేము మిమ్మల్ని రక్షిస్తున్నాం
  • దీనికి ప్రతిఫలంగా మా మిలిటరీకి చెల్లింపులు చేయండి
  • మా సాయాన్ని ఆయిల్ సరఫరా చేసే దేశాలు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నాయి
  • చమురు ధరలను పెంచేస్తున్నాయి 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దౌత్యసంబంధాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. అమెరికా మిలిటరీ అండ లేకపోతే మీరు రెండు వారాలు కూడా అధికారంలో కొనసాగలేరంటూ సౌదీ అరేబియా రాజు సల్మాన్ ను ఉద్దేశించి అన్నారు. 'మేము సౌదీని రక్షిస్తున్నాం. సౌదీ రాజు సల్మాన్ అంటే మాకు చాలా ఇష్టం. మిమ్మల్ని మేము రక్షిస్తున్నామని సల్మాన్ కు చెప్పాను. మేము లేకుండా మీరు రెండు వారాలు కూడా ఉండలేరని తెలిపాను. దీనికి ప్రతిఫలంగా మా మిలిటరీకి మీరు చెల్లింపులు చేయాలి అని చెప్పా' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మిస్సిస్సిపిలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అయితే, సౌదీ రాజుతో ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత... ట్రంప్ తన తొలి విదేశీ పర్యటనకు సౌదీకే వెళ్లారు. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే తొలి స్థానంలో ఉంది. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో, సౌదీపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. చమురు మార్కెట్ ఒడిదొడుకులకు లోను కాకుండా స్థిరంగా ఉండేలా సౌదీ చర్యలు చేపట్టాలని... ఇందులో భాగంగా చమురు సరఫరాను ఎప్పటిలాగానే స్థిరంగా కొనసాగించాలని చెప్పారు.

గత నెల న్యూయార్క్ లో ట్రంప్ మాట్లాడుతూ, చమురు సరఫరా చేసే దేశాల నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే తాము ఆ దేశాలను రక్షిస్తున్నామని చెప్పారు. కానీ, తమ సాయాన్ని వారు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని... ప్రతిఫలంగా అధిక ధరకు చమురును సరఫరా చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని విమర్శించారు. చమురు ధరలను పెంచడాన్ని వారు ఆపేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. అంతేకాదు, రక్షణ రంగంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని తమ మిత్ర దేశాలు జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ తదితర దేశాలకు కూడా సూచించారు.

ఈ అంశంపై సౌదీ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ స్పందిస్తూ... గత శనివారం రాజు సల్మాన్ తో ట్రంప్ మాట్లాడారని తెలిపింది. ఆయిల్ మార్కెట్ సుస్థిరంగా ఉండేందుకు చమురు సరఫరాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించారని పేర్కొంది. 

More Telugu News