Krishna District: కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్.. ‘దివిసీమ’ నేపథ్యంలో కీలక సీన్లు!

  • అవనిగడ్డ చేరుకున్న సినిమా యూనిట్
  • వారం రోజుల పాటు సాగనున్న చిత్రీకరణ
  • దివిసీమ ఉప్పెన నేపథ్యంలో కీలక సీన్లు షూట్

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ‘బయోపిక్’ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తుండగా, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యా బాలన్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా యూనిట్ కృష్ణా జిల్లా దివిసీమకు చేరుకుంది. దివిసీమలోని హంసలదీవి, కోడూరులో నేటి నుంచి వారం రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన దివిసీమ ఉప్పెన, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితులు, ఎన్టీఆర్-ఏఎన్నార్ కలిసి విరాళాలు సేకరించిన సీన్లను షూట్ చేయనున్నారు. ఈ షూటింగ్ లో బాలకృష్ణ, రానా, సుమంత్ పాల్గొననున్నారు. షూటింగ్ సందర్భంగా చిత్ర యూనిట్ వారం రోజుల పాటు అవనిగడ్డలోనే బస చేయనుంది.

మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో స్టార్ తారాగణం పెరిగిపోయిన నేపథ్యంలో రెండున్నర గంటల్లో 'ఎన్టీఆర్ ' కథను చెప్పడం కష్టమేనని క్రిష్ అనుకుంటున్నట్లు సమాచారం. అభిమానులు బాధపడకుండా ఎన్టీఆర్ జీవితంలోని అన్ని కీలక ఘట్టాలను కవర్ చేసేందుకు వీలుగా రెండు భాగాలుగా సినిమాను తీయాలని క్రిష్ అనుకుంటున్నాడట. ఈ విషయంలో బాలకృష్ణను సంప్రదించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సినిమా యూనిట్ చెబుతోంది.

More Telugu News