Lions: అంతుబట్టని రోగం... గిర్ అడవుల్లో 21 సింహాలు మృతి!

  • 18 రోజుల వ్యవధిలో 21 సింహాల మృతి
  • పురుగుల ద్వారా వ్యాపిస్తున్న ఇన్ ఫెక్షన్
  • రెస్క్యూ కేంద్రానికి పలు సింహాల తరలింపు

గుజరాత్ లోని గిర్ అభయారణ్యంలో గుర్తు తెలియని వైరస్, ఇన్ ఫెక్షన్ల కారణంగా మృతి చెందుతున్న సింహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడచిన 18 రోజుల వ్యవధిలో 21 సింహాలు మరణించినట్టు గుర్తించిన అధికారులు, వీటిల్లో నాలుగు సింహాలు వైరస్ తో, ఆరు సింహాలు ప్రొటోజోవా ఇన్ ఫెక్షన్ తో మరణించాయని భావిస్తున్నట్టు తెలిపారు. పురుగుల ద్వారా ఈ ఇన్ ఫెక్షన్ వ్యాపిస్తోందని నిర్ధారించిన అధికారులు, దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్ ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఇదే ప్రాంతంలోని పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు. మరణించిన సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్ ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.

More Telugu News