Rajasthan: కేబీసీ స్ఫూర్తి.. చట్టాలపై అవగాహన పెంచేందుకు కేబీసీలాంటి ప్రోగ్రాంను రూపొందించిన పోలీసులు!

  • రాజస్థాన్ పోలీసుల ‘కేబీసీ’
  • రోజుకో ప్రశ్నను పోస్టు చేస్తున్న పోలీసులు
  • భవిష్యత్తులో ప్రైజ్ మనీ కూడా ఇచ్చే ఆలోచన 

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం ద్వారా కోటి రూపాయలు గెలుచుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పించే ఈ గేమ్ షోకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.

కేబీసీతో స్ఫూర్తి పొందిన రాజస్థాన్ పోలీసులు ‘కిత్నా బడా క్రైమ్’ (కేబీసీ) పేరుతో ఓ క్విజ్ ప్రోగ్రాంను రూపొందించారు. చట్టాలు, నేరాలపై పౌరులకు అవగాహన కల్పించడంలో భాగంగా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 24 నుంచి సోషల్ మీడియాలో రోజుకో ప్రశ్నను పోస్టు చేస్తున్నారు.  తొలి ప్రశ్న.. ‘‘ఇష్టం లేకపోయినా లైంగిక వాంఛలు తీర్చమని కోరడం ఐపీసీలోని ఏ సెక్షన్‌ కిందికి వస్తుంది?’’ అన్న ప్రశ్నకు (ఎ) సెక్షన్ 354 ఎ(II), (బి) సెక్షన్ 302, (సి) సెక్షన్ 420, (డి) వీటిలో ఏదీ కాదు.. అని ఆప్షన్లు కూడా ఇచ్చారు.

ఈ ప్రశ్నకు 84 మంది స్పందించారు. సరైన సమాధానాలు చెప్పే వారికి ప్రస్తుతం ఎటువంటి నగదు బహుమతి ఇవ్వడం లేదని, అయితే, ఇచ్చే ఆలోచన ఉందని  ఏడీజీ (సీబీ అండ్ సీఐడీ) పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు.  ప్రజల స్పందనను బట్టి త్వరలోనే దీనిని అమలు చేస్తామన్నారు.

More Telugu News