Telangana: మేనిఫెస్టోలో బీజేపీ బంపరాఫర్.. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న వారికి నెలకు రూ.5 వేలు!

  • బీజేపీ ముసాయిదా మేనిఫెస్టో విడుదల
  • నెలకు రూ.5 వేల అద్దె
  • విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
  • సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలపై హామీల జడివాన కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోరాడుతున్న బీజేపీ ప్రజాకర్షక మేనిఫెస్టో తయారీకి రంగం సిద్ధం చేసింది. పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశమైన పార్టీ రాష్ట్ర నాయకత్వం మేనిఫెస్టోలో ఉండాల్సిన విషయాలపై చర్చించింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్తుకు తమ మేనిఫెస్టో ఉపయోగపడుతుందన్నారు. 15వ తేదీకల్లా మేనిఫెస్టోకు తుదిరూపం ఇవ్వనున్నట్టు చెప్పారు.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ రూపొందించిన ముసాయిదా మేనిఫెస్టో ప్రకారం.. భాగ్యనగరంలో అద్దెకు ఉంటున్న ప్రతీ కుటుంబానికి నెలకు రూ.5వేలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. నీటి పన్నును ఆరు రూపాయలు వసూలు చేస్తారు. కాలుష్య నియంత్రణకు ఆటో, వ్యాన్ మార్పిడి పథకం. డప్పు కొట్టే వారు, చెప్పులు కుట్టే వారికి నెలకు రూ.3 వేల పింఛన్. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఉచిత విద్యుత్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు, డిగ్రీ పైస్థాయి ఉద్యోగులకు ఉచిత ల్యాప్ టాప్‌లు, 60 ఏళ్లు నిండిన వ్యవసాయ కూలీలకు, చేతి, కుల వృత్తుల వారికి రూ.3 వేల పింఛన్, ప్రతీ ఏడాది ఉద్యోగాల భర్తీ చేస్తారు. 

More Telugu News