Husband: భార్యా బాధితుల కోసం సరికొత్త పార్టీ.. అధ్యక్షుడిగా తాడేపల్లిగూడెం వాసి!

  • విజయవాడలో పురుడు పోసుకున్న పార్టీ
  • భరణం, గృహహింస వంటి వాటిని చట్టం నుంచి తొలగించాలని డిమాండ్
  • భర్త రెండో పెళ్లికి అనుమతి ఇవ్వాలన్న పార్టీ అధ్యక్షుడు

ఇప్పటి వరకు భార్యా బాధితుల సంఘాలను మాత్రమే చూశారు. ఇప్పుడు ఏకంగా ఓ రాజకీయ పార్టీనే పురుడు పోసుకుంది. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమక్షంలో ఆదివారం విజయవాడలో ఈ పార్టీని ప్రకటించారు. ‘భార్యా బాధితులు, అత్త-ఆడపడుచులు, వదిన-మరదళ్లు, తోటి కోడళ్లు’ పేరుతో పార్టీని స్థాపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన జి.బాలాజీని ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 498 (ఎ) కేసుల్లో ఏడాదిలోగా తీర్పు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు. భరణం, గృహహింస వంటి వాటిని చట్టం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చట్టాల రూపకల్పనలో సమానత్వం పాటించాలన్నారు. భార్యా బాధితులను సమాజం చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపై ఈ విషయంలో మార్పు రావాలన్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేందుకు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. అలాగే, ‘భార్యా బాధితుల సంఘం’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించారు. హైదరాబాద్, లేదంటే విజయవాడలో  ‘రన్‌ ఫర్‌ భార్యా బాధితులు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
 

More Telugu News