kidari sarveshwara Rao: కిడారి హత్యలో కొత్త కోణం.. ఎమ్మెల్యే హత్య వెనక టీడీపీ నేత.. 19నే మర్డర్ ప్లాన్?

  • కిడారి హత్యలో టీడీపీ ఎంపీటీసీ కీలకపాత్ర
  • ఆయనిచ్చిన సమాచారం మేరకే హత్య
  • భార్యకు అనారోగ్యంతో 19న బతికిపోయిన కిడారి

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన హత్యకు సొంతపార్టీ నేతే ప్లాన్ వేశాడన్న విషయం వెలుగులోకి వచ్చి సంచలనానికి కారణమైంది. పోలీసు వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అరకు నియోజకవర్గానికే చెందిన టీడీపీ ఎంపీటీసీ కిడారి హత్యకు పథకం రచించినట్టు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు ఆయన మూడుసార్లు ఆశ్రయం కల్పించినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

కిడారిని హత్య చేయాలని భావించిన మావోలు తొలుత రాజకీయంగా ఆయనతో విభేదించే వారి వివరాలను సేకరించారు. మన్యంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తితో ఆగస్టులో టీడీపీ ఎంపీటీసీని రహస్య స్థావరానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత టీడీపీ మండలస్థాయి నేతతోనూ మాట్లాడారు. గ్రామాల్లోకి ఎమ్మెల్యే వచ్చేముందు తమకు సమాచారం అందించాలని సూచించారు. ప్లాన్‌లో భాగంగా సెప్టెంబరు 19న గ్రామదర్శిని కార్యక్రమానికి రావాలంటూ ఎమ్మెల్యేను ఆ నాయకుడు ఆహ్వానించాడు. కిడారి వస్తానని చెప్పడంతో ఆ విషయాన్ని ఆయన మావోలకు చేరవేశాడు. అయితే, అదే రోజు ఎమ్మెల్యే భార్య అనారోగ్యానికి గురవడంతో ఆయన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో ప్లాన్ ఫలించలేదు.  

ఈ క్రమంలో సెప్టెంబరు 23న వస్తానని ఎమ్మెల్యే కిడారి స్థానిక నేతలకు ఫోన్ చేసి మాటిచ్చారు. దీంతో ఆయన హత్యకు మావోలు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రెండు బృందాలుగా రంగంలోకి దిగారు. ఓ బృందం గ్రామంలోకి వాహనాలను రాకుండా అడ్డుకోగా, మరో బృందం పనికానిచ్చింది. కిడారి, సోమలను కాల్చి చంపింది.  

More Telugu News