kcr: వాళ్లిద్దరినీ వంద మీటర్ల గొయ్యి తీసి పాతరేయాలి: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్, గంప గోవర్ధన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన రేవంత్
  • రాష్ట్రాన్ని కేసీఆర్, కామారెడ్డిని గంప దోచుకుంటున్నారు
  • అడవిపందులు పడ్డట్టు టీఆర్ఎస్ నాయకులు పడ్డారు

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి లపై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్, గోవర్ధన్ రెడ్డిలను వంద మీటర్ల గొయ్యి తీసి పాతరేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదని వారిపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే, ఈ ఎమ్మెల్యే కామారెడ్డిపై పడి తింటున్నాడని, గంప తన తట్టాబుట్టా సర్దుకునే సమయం దగ్గరపడిందని అన్నారు.

‘వీళ్ల వ్యవస్థ అంతా అడవిపందుల వ్యవస్థ. చెరకు తోటల మీద అడవిపందులు పడితే.. తిన్నకాడికి తిని, ఉన్నదంతా తొక్కి సర్వనాశనం చేసిపోతాయి. చెరకుతోటల మీద అడవి పందులు పడ్డట్టు రాష్ట్రంపై టీఆర్ఎస్ నాయకులు పడ్డారు. తిన్నకాడికి తిని.. దోచిన కాడికి దోచి.. మిగిలినదంతా ఎవ్వరికీ అక్కరకు రాకుండా సర్వనాశనం చేసి పోవడానికి కంకణం కట్టుకుని ఉన్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా రైతులు పగటి పూటయితే కాపలాగా ఉంటారు, రాత్రి పూట అడవిపందులొచ్చి పాడు చేయకుండా ఉండడానికి  కరెంట్ తీగలు అడ్డం కడతారని రేవంత్ అన్నారు.

‘మరి, ఆరు నెలలకొక్కసారి పండించుకునే పంటను అడవిపందులు పాడు చేయకుండా కరెంట్ తీగలు కాపాడుకుంటుంటే.. మన భవిష్యత్ తరాల కోసం తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? టీఆర్ఎస్ నాయకులకు కరెంట్ షాక్ కొట్టించాల్సిన అవసరం ఉందా? లేదా? మన కరెంట్ ‘ఓటు’. ఆ ఓటు ను ‘చెయ్యి’ గుర్తు మీద వేసి మీరు మమ్మల్ని గెలిపించాలని’ రేవంత్ కోరారు.  

More Telugu News