Techchie: వివాహమైన స్నేహితురాలిని వేధిస్తున్న విద్యావంతుడు... కటకటాల వెనక్కి పంపిన పోలీసులు!

  • ఐదేళ్ల పరిచయాన్ని స్నేహంగా భావించిన యువతి
  • ప్రేమనుకున్న ఎంటెక్ విద్యార్థి
  • వివాహం కావడంతో బయటకొచ్చిన మరో కోణం

ఐదేళ్లు స్నేహంగా ఉన్నాడు. ఆమె మాత్రం ఓ మంచి స్నేహితుడనే అనుకుంది. కానీ, పెళ్లయిన తరువాత తనలోని మరో కోణాన్ని బయటకు తీశాడో విద్యావంతుడు. ఆమెను వేధించడం మొదలెట్టాడు. ఇప్పుడతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాదు శివారు బోడుప్పల్ ప్రాంతంలో ఉంటున్న మహ్మద్ పాషా, అక్కడే ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఐదేళ్ల క్రితం చేరాడు. ఆ సమయంలో అశోక్ నగర్ కు చెందిన ఓ యువతి పరిచయం అయింది. చదువు పూర్తయిన తరువాత షాషా ఎంటెక్ లో చేరగా, ఆమె ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా స్థిరపడింది. అప్పుడప్పుడూ వీరిద్దరి మధ్యా ఫోన్ సంభాషణలు సాగాయి.

ఈ సంవత్సరం జూలై 1న ఆమెకు వివాహం జరుగగా, తన వికృత చేష్టలతో ఆమెను వేధించడం ప్రారంభించాడు పాషా. భర్త ఫోన్ నంబర్ ను తెలుసుకుని, గతంలో తనతో దిగిన ఫొటోలను పంపించాడు. ఆమెకు ఫోన్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. నువ్వు ఫ్రెండనుకున్నావేమోగానీ, నేను మాత్రం నిన్ను ప్రియురాలిగానే చూశానని హెచ్చరించాడు. దీంతో ఆమె విషయమంతా తన భర్తకు చెప్పి, ఆయన సాయంతో పోలీసులను ఆశ్రయించింది. పాషాను అరెస్ట్ చేసిన పోలీసులు, అతన్ని రిమాండ్ కు తరలించారు.

More Telugu News