India: తీరుమార్చుకోని పాకిస్థాన్‌తో చర్చలు ఎలా సాధ్యం : సుష్మాస్వరాజ్‌

  • ఐరాసా వేదికపై దాయాదిని కడిగిపారేసిన విదేశాంగ మంత్రి
  • పాకిస్థాన్‌ వైఖరి వల్లే ముందడుగు పడడం లేదని స్పష్టీకరణ
  • తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు

‘ఓవైపు శాంతియుత విధానం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం అంటూ చిలకపలుకులు వల్లెవేస్తూనే మరోవైపు ఉగ్రవాదానికి బాహాటంగా మద్దతిస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు ఎలా సాధ్యం?’... అని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ సూటిగా ప్రశ్నించారు. సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామని అంటారు, మరోవైపు ముంబయి ముష్కరదాడులకు కుట్రపన్నిన వారిని బాహాటంగా తిరగనిస్తున్నారు, ఈ తీరును ఏమనుకోవాలన్నారు. ఐక్యరాజ్యసమితి 73వ సర్వప్రతినిధి సభ వేదికపై శనివారం ప్రసంగించిన సుష్మాస్వరాజ్‌ పాక్‌ దుష్టపన్నాగాలను ఎండగట్టారు.

'పాక్‌తో చర్చలు జరిపేందుకు ఎప్పటికప్పుడు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ అవి ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్నది పాక్‌ తీరే' అని దుయ్యబట్టారు. ‘పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ బాధ్యతలు స్వీకరించాక విదేశాంగ మంత్రుల స్థాయి చర్చలకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను మా ప్రధాని మోదీ మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. మోదీ సుముఖత వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌ జవాన్లు ముగ్గురుని కిరాతకంగా చంపేశారు. చర్చలు కోరుకునే విధానం ఇదేనా?’ అని అన్నారు.

మా సరిహద్దు ఆవలే ఉగ్రవాదం పురుడు పోసుకుని భారత్‌పై బుసలుకొడుతోంది. రక్తతర్పణం మధ్య చర్చలు ఎలా సాధ్యమో మీరే చెప్పాలని కోరారు. తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై వంచనతో నిందలు వేయడం పాక్‌కు అలవాటుగా మారిందని, ప్రపంచం దీన్ని గుర్తించిందన్నారు. పాక్‌ను విశ్వసించేందుకు ప్రపంచం ఏ మాత్రం సిద్ధంగా లేకపోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సుష్మాస్వరాజ్‌ ప్రసంగం అంతా హిందీలో సాగింది.

More Telugu News