ATF: విమాన ప్రయాణం మరింత భారం : పెరగనున్న టికెట్ ధరలు

  • నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఆలోచన చేస్తున్న యాజమాన్యాలు
  • పండగ సీజన్‌ నుంచి అమలు చేసే అవకాశం
  • ఏటీఎఫ్‌ ధర పెంపుతోపాటు 5 శాతం కస్టమ్స్‌ సుంకం ప్రభావం

త్వరలో విమాన ప్రయాణం భారం కానుంది. నిన్నమొన్నటి వరకు డిస్కౌంట్లు, చౌక విమానయానం వంటి ఆకర్షణలతో దిగువ మధ్య తరగతి ప్రజల్ని కూడా ఆకర్షించిన విమానయాన సంస్థలు పెరుగుతున్న ఆర్థిక భారంతో ఇక తమవల్లకాదని చేతులెత్తేస్తున్నాయి.

ఓ వైపు రూపాయి ధర పతనం అవుతుండడం, మరోవైపు విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడం, దీనిపై ఐదు శాతం కస్టమ్స్‌ సుంకం విధించాలని కేంద్రం నిర్ణయించడం విమానయాన సంస్థల్ని ఆలోచనల్లో పడేసింది. విమాన ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయాయి. జెట్‌ ఫ్యూయిల్‌ నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఆయా సంస్థలకు లేదు. ఇంధన ధరలే అధికం అనుకుంటే వివిధ రాష్ట్రాలు విధిస్తున్న సెస్‌తో సంస్థలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేంద్రం విధించిన ఎక్సైజ్‌ సుంకం వల్లే ఒక్కో సంస్థపై నెలకు 25 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.

విమానయాన రంగంలో పోటీ పెరగడంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పలు సంస్థలు గతంలో డిస్కౌంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. దీంతో ఆర్థికంగా కంపెనీలపై తీవ్రభారం పడింది. ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా, ప్రైవేటు సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ వంటి వాటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థల పరిస్థితి కూడా ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి ఆర్థికంగా నిదొక్కుకోవాలంటే టికెట్‌ ధర పెంపు ఒక్కటే మార్గమని, ఇందుకు పండగ సీజన్‌ మంచిదని విమానయాన సంస్థలు ఆలోచన చేస్తున్నాయి.

ధరలను పెంచితే ఆర్థికంగా కొంత గాడిలో పడతామని ఆయా సంస్థల ఆలోచన అని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. ఇంధన ధర పెంపు ఓ వైపు దేశీయ సంస్థలను దెబ్బతీస్తుంటే, విదేశీ సంస్థలు మాత్రం లాభపడుతున్నాయి. ‘టికెట్‌ ధరలు పెరిగితే విదేశీ సంస్థ విమానాల కంటే మన దేశీయ విమాన చార్జీలు అధికంగా ఉంటాయి. దీంతో ప్రయాణికులు అటువైపు మళ్లే అవకాశం ఉంది. ఇది మరింత ప్రమాదకరం. మొత్తంమ్మీద ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశీయ విమానరంగం కోలుకునేందుకు చాలా సమయమే పట్టేలా ఉంది’ అని స్పైస్‌ జెట్‌ చైర్మన్‌ అజయ్‌సింగ్‌ వ్యాఖ్యలు ప్రస్తావనార్హం.

More Telugu News