Telangana: తెలంగాణ ఇస్తున్నామని సోనియా చెప్పగానే, కేసీఆర్ నన్ను తరిమేశారు: విజయశాంతి

  • ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా విజయశాంతి
  • కేసీఆర్ పాలన చూసిన తరువాత మాట్లాడాలని అనుకున్నా
  • నన్ను సస్పెండ్ చేసిన కారణం చెప్పలేదు
  • అనుకున్నది ఒకటి, తెలంగాణలో జరుగుతున్నది ఒకటన్న విజయశాంతి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన నటి విజయశాంతి, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు స్వీకరించి, స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగారు. ఇంతకాలం ఎందుకు తెలంగాణ ప్రజలకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నను ఆమె ముందుంచిన వేళ, కేసీఆర్ ఎలా పాలిస్తున్నారో చూసిన తరువాత మాట్లాడాలని అనుకున్నానని, ఆయనేమైనా అద్భుతాలు చేస్తారేమోనని చూశానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని 2013 జూలైలో కాంగ్రెస్‌ ప్రకటించిన నాటి రాత్రే తనను టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ సస్పెండ్‌ చేశారని విజయశాంతి ఆరోపించారు. అప్పట్లో తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటన్న విషయాన్ని చెప్పలేదన్న ఆమె, 2014లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాసైన తరువాతే తాను కాంగ్రెస్ లో చేరానని గుర్తు చేశారు.

స్వరాష్ట్రం గురించి తాను అనుకున్నది ఒకటైతే, ఇక్కడ జరుగుతోంది మరొకటని, అందువల్లే తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వచ్చానని అన్నారు. అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రకటించినా, ఎటువంటి సమస్య ఉండబోదని, టీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతే తమ బలమని అన్నారు. ఇక కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉండటంపై తన అభిప్రాయాన్ని అధిష్ఠానంతో ఇప్పటికే చెప్పానని, దాని గురించి బయట చర్చించడం బాగుండదని అన్నారు.

More Telugu News