Andhra Pradesh: త్వరలోనే మా తడాఖా ఏంటో చూపిస్తాం: కిడారి హత్యపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్

  • నేతల హత్యల వెనక ఎటువంటి కారణం లేదు
  • సంచలనం కోసమే ఘాతుకం
  • త్వరలోనే అరెస్టులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల విషయంలో పోలీసులు వైఫల్యం కనిపిస్తోందన్న విమర్శలపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ఈ విషయంలో మావోలు సవాలు విసిరారని, త్వరలోనే బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే హత్య వెనుక ఎటువంటి కారణాలు కనిపించడం లేదని, కేవలం సంచలనం కోసమే మావోలు ఈ పనికి పాల్పడ్డారని తెలిపారు. నక్సల్ ఆపరేషన్‌లో ఒడిశాకు చెందిన గోండు జాతి మహిళలు పాల్గొన్నారని పేర్కొన్న డీజీపీ, వారికి స్థానికంగా ఎవరు సహకరించిందీ మరో రెండు రోజుల్లో వెల్లడిస్తామన్నారు.  

ఎమ్మెల్యేను మావోలు చర్చలకు తీసుకెళ్లారన్న వార్తల్లో నిజం లేదని, ఆయనను ట్రాప్ చేశారని డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. సోమను ఎందుకు చంపారో తెలియడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. మావోయిస్టులకు ఎవరు సహకరించిందీ తెలిసిందని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. హత్యల్లో పాల్గొన్న వారిలో ఎక్కువమంది ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి వచ్చినవారేనని, వారిలో ఎక్కువ మంది గోండు మహిళలు ఉన్నారని వివరించారు.  

హత్యల విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్న ప్రశ్నకు డీజీపీ సమాధానం చెబుతూ.. ఈ విషయంలో బాధ్యత తమదేనని గతంలోనే చెప్పినట్టు చెప్పారు. కొన్నాళ్లుగా ఎటువంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసుల దృష్టి అటువైపు వెళ్లలేదని, దీంతో ఇదే అదనుగా వారు తెగబడ్డారని పేర్కొన్నారు. తమపై దాడులకు ప్రయత్నించి విఫలమవడంతోనే నేతలను హత్య చేశారని త్వరలోనే బదులు తీర్చుకుంటామని డీజీపీ ఠాకూర్ తేల్చి చెప్పారు.

More Telugu News