బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న వేళ... విరుచుకుపడిన రాకాసి అల... పాలిలోనే 250 మంది మృతులు!

30-09-2018 Sun 06:21
  • సురవేసి దీవుల్లో బీచ్ ఫెస్టివల్
  • ఆనందంగా ఉన్న వేళ దూసుకొచ్చిన సునామీ
  • కకావికలమైన పాలీ నగరం
తీవ్రమైన భూకంపం, దాని పర్యవసానంగా సంభవించిన సునామీ, ఇండోనేషియాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పాలి నగరంలోని సురవేసి దీవుల్లో బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న వేళ, సునామీ అలలు విరుచుకుపడ్డాయి. దీంతో ఫెస్టివల్ కు వచ్చిన వారు ఆందోళనతో అటూ ఇటూ పరిగెత్తగా, సుమారు 250 మంది సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది.

 ఇక్కడ వివిధ కళారూపాలను ప్రదర్శించడానికి వచ్చిన కళాకారుల్లో అత్యధికులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన వారిలో అత్యధికుల ఆచూకీ తెలియడం లేదు. దీంతో వారి బంధుమిత్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పాలీ నగర వీధుల్లో ఇప్పుడు ఎటు చూసినా రోదనలే. తమ వారు మరణించడమో లేదా ఆచూకీ లేకుండా పోయిందనో ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.