Revanth Reddy: రెండు, మూడు రోజులుగా తెలంగాణలో విచిత్రమైన డ్రామా జరుగుతోంది: జగదీష్ రెడ్డి

  • ఎవరో ఫిర్యాదు చేస్తేనే రేవంత్ నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి
  • ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందనే జ్ఞానం కూడా కాంగ్రెస్ నేతలకు లేదు
  • ఒక చిల్లర నేతకు కాంగ్రెస్ సీనియర్లు మద్దతు పలుకుతున్నారు

రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగితే ఏవో భయంకరమైన తుపాన్లు వచ్చినట్టు కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని, మానవాళికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో విచిత్రమైన డ్రామా నడుస్తోందని చెప్పారు.

 రాజకీయ పార్టీలకు అతీతంగా ఐటీ సోదాలు జరుగుతాయని అన్నారు. ఎవరో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తేనే ఐటీ సోదాలు జరిగాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలతో జైళ్లు నిండుతాయోమో అన్నట్టుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండటం విచిత్రంగా ఉందని అన్నారు. ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందనే ఇంగితజ్ఞానం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు.

ఐటీ సోదాలనేవి రేవంత్ రెడ్డితోనే మొదలైనవి కాదని... ఈ అంశాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు కూడా... కుండల కొద్దీ కన్నీరును కారుస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్దోళ్లను తిడితే పెద్దోడిని అవుతాననే భావనతోనే కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్టు రేవంత్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గెలిచే శక్తి లేకే కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు కులం ప్రస్తావన తీసుకురావడం దారుణమని జగదీష్ రెడ్డి అన్నారు. అధికారులను కూడా విమర్శిస్తున్నారని... కాంగ్రెస్ హయాంలో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ నేతల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరిగాయని... ఇలాంటి చిల్లర పనులతో కాంగ్రెస్ కు ఓట్లు పడవని చెప్పారు. ఒక చిల్లర నేతకు కాంగ్రెస్ సీనియర్లు మద్దతు పలకడం ఏమిటని ప్రశ్నించారు. 

More Telugu News