Kodandaram: మహాకూటమికి పేరు కూడా పెడతాం.. సీట్ల సర్దుబాటుపై చర్చ అనవసరం: కోదండరామ్

  • ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే క్రమంలోనే కూటమి ఏర్పాటు
  • ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ ను తయారు చేశాం
  • మహాకూటమి పేరు మేము పెట్టుకున్నది కాదు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే... రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని అందరూ భావించారని... ఆ ఉద్యమ ఆకాంక్షలను సాధించాలనే క్రమంలోనే తామంతా కూటమిగా ఏర్పడటం జరిగిందని టీజేఎస్ అధినేత కోదండరామ్ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశ పాలనను తొలగించాలని అన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, నిరంకుశ పాలనను తరిమివేయడం అనే రెండు లక్ష్యాలతో ఒక డ్రాఫ్ట్ తయారయిందని... పార్టీల నేతల నుంచి మరికొన్ని అభిప్రాయాలను కూడా తీసుకుని అక్టోబర్ 2 నాటికి పూర్తి స్థాయిలో డ్రాఫ్ట్ ను రూపొందిస్తామని చెప్పారు. మహాకూటమి నేతలు ఈ రోజు హైదరాబాదులో అత్యవసరంగా భేటీ అయ్యారు. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చ ఇంత వరకు రాలేదని కోదండరామ్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే దీనిపై కొంత స్పష్టతను ఇచ్చారని... ఈ నేపథ్యంలో, దీనిపై మళ్లీమళ్లీ చర్చ అనవసరమని చెప్పారు. మహాకూటమి అనేది తాము పెట్టుకున్న పేరు కాదని... మేనిఫెస్టో పూర్తయిన తర్వాత మహాకూటమికి ఒక పేరును కూడా పెట్టాలనుకుంటున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ను ఓడించడమే కూటమి లక్ష్యమని చెప్పారు.

More Telugu News