టీఆర్ఎస్ కు బాబుమోహన్ షాక్.. మరికాసేపట్లో బీజేపీ తీర్థం!

29-09-2018 Sat 12:06
  • ఆందోల్ టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపం
  • జర్నలిస్ట్ క్రాంతికుమార్ కు టికెట్ ఇచ్చిన కేసీఆర్
  • లక్ష్మణ్ తో కలసి ఢిల్లీకి పయనమైన బాబుమోహన్ 
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తాజా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ సినీ నటుడు బాబుమోహన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం నుంచి మరోసారి టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన బాబుమోహన్ ఈరోజు ఉదయం తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ పై బాబుమోహన్ గెలుపొందారు. ఇటీవల కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో... 105 నియోజక వర్గాలకు పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించి కలకలం రేపారు. ఇందులో భాగంగా ఆందోల్ అసెంబ్లీ టికెట్ ను జర్నలిస్ట్ క్రాంతికుమార్ కు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి లోనైన బాబుమోహన్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.