miryalaguda: మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటు కేసు.. అధికారుల అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు!

  • అనుమతులు తీసుకున్నాకే ఏర్పాటు చేసుకోవాలి 
  • జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు నోటీసులు
  • త్వరలోనే ప్రణయ్ తండ్రికి నోటీసులు

మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ విగ్రహ ఏర్పాటుకు బ్రేక్ పడింది. జిల్లా అధికారుల అనుమతులు తీసుకున్నాకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త హంతకులు సిగ్గుపడేలా మిర్యాలగూడ పట్టణంలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని అతని భార్య అమృత వర్షిణి కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న వెంకటరమణారావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ప్రణయ్ విగ్రహ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జస్టిస్  ఏవీ శేషసాయి.. ప్రణయ్ విగ్రహం ఏర్పాటుపై కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, టూటౌన్ సీఐ, మున్సిపల్ కమిషనర్ కు నోటీసులు జారీచేశారు. అలాగే ఈ విషయంలో ప్రణయ్ తండ్రికి నోటీసులు ఇవ్వాలని టూటౌన్ సీఐని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను వచ్చే నెల 23న చేపడతామన్న ధర్మాసనం.. ఆ రోజు తమముందు హాజరుకావాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు అమృత వర్షిణి తండ్రి మారుతీరావు ఇల్లు, ఆఫీసుల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్‌ కు ఇచ్చిన కోటి రూపాయలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News