Andhra Pradesh: కేంద్రం చేసిన మోసంపై ధర్మ పోరాట దీక్ష.. ముస్తాబయిన తాడేపల్లిగూడెం!

  • 2 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా
  • ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు
  • వేదికకు అల్లూరి సీతారామరాజు పేరు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఏపీ ప్రభుత్వం ఈరోజు ధర్మ పోరాట దీక్షను నిర్వహించనుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే తిరుపతి, ఒంగోలు, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వం ధర్మపోరాట దీక్షలను విజయవంతంగా నిర్వహించింది. తాజాగా ఆరో ధర్మ పోరాట దీక్షను తాడేపల్లిగూడెంలో ప్రభుత్వం నేడు చేపట్టనుంది.

ఈ సభకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. సీఎం సహా 150 మంది అతిథులు ఆసీనులయ్యేలా భారీ వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వేదికకు మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు వేదిక’గా నామకరణం చేశారు. సభా ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి.

ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి 20,000 వాహనాల్లో ప్రజలు ధర్మ పోరాట దీక్షా స్థలికి చేరుకుంటారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

More Telugu News