Whatsapp: ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో నిండా మునిగిన కంపెనీ.. రూ.9,200 కోట్లు హరీ!

  • ఒక్క మెసేజ్‌తో ఘోరంగా దెబ్బతిన్న ఇన్ఫీబీమ్ షేర్లు
  • ముప్పావు శాతం సంపద ఆవిరి
  • కంపెనీ ఏజీఎం సమావేశానికి ఒక్క రోజు ముందే ఘటన

ఒక్క వాట్సాప్ మెసేజ్ ఓ కంపెనీని అడ్డంగా ముంచింది. ఏకంగా రూ.9,200 కోట్లు నష్టపోవడానికి కారణమైంది. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్ అనే కంపెనీకి శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఎదురైన చేదు అనుభవం ఇది. కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందని చెబుతూ ఓ వాట్సాప్ మెసేజ్ వాణిజ్య వర్గాల్లో విపరీతంగా షేర్ అయింది. ఎటువంటి హామీలు లేకుండా అప్పులు, వడ్డీ లేని రూపంలో రూ.135 కోట్ల మేరకు అవకతవకలకు పాల్పడిందనేది ఆ మెసేజ్ సారాంశం. కొన్ని నెలల క్రితం ఈ మెసేజ్‌ను ఈక్విరస్‌ సంస్థ, కొంతమంది క్లయింట్లకు పంపించింది. ఇది వాణిజ్య వర్గాల్లో కూడా షేర్ కావడంతో కంపెనీపై అనుమానాలు తలెత్తి షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. కంపెనీ ఏజీఎం సమావేశానికి ఒక్క రోజు ముందు ఈ మెసేజ్ వైరల్ కావడం గమనార్హం.

వాట్సాప్ మెసేజ్ కారణంగా  కంపెనీ షేర్ శుక్రవారం ఏకంగా 70 శాతం క్షీణించింది. బీఎస్ఈలో గురువారం  రూ.196  వద్ద ముగిసిన ఈ షేర్‌.. శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. అలాగే, ఇంట్రాడేలో 73 శాతం పతనంతో  రూ.53.80ను తాకింది. బీఎస్‌ఈలో 1.9 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,200 కోట్లు కోల్పోయి రూ. 3,902 కోట్లకు పడిపోయింది.

More Telugu News