Telangana: రేవంత్ రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు.. ప్రింటర్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం!

  • ఈ తెల్లవారుజామున 2:30 గంటల వరకు సోదాలు
  • 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు
  • రేవంత్ భార్యను తీసుకెళ్లి లాకర్ల తనిఖీ

కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి ఏడు గంటలకు రేవంత్ ఇంట్లో అధికారులు సోదాలు ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సోదాల్లో ప్రింటర్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రూ.20 కోట్లు లెక్కలు చూపని ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ సొమ్ము రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

రేవంత్ రెడ్డి, ఆయన భార్యను కలిపి దాదాపు 31 గంటలపాటు అధికారులు విచారించారు. 150 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాయించుకున్నారు. అక్టోబరు 3న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.

కాగా, తన వియ్యంకుడు పోర్షే కారు వాడుతుండడంపై అధికారులు అడిగిన ప్రశ్నకు రేవంత్ బదులిస్తూ.. అతడు పోర్షే కారు వాడితే తప్పేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. రేవంత్ ఇంటికి ఓటుకు నోటు నిందితుడు ఉదయసింహను అధికారులు తీసుకొచ్చారు. రూ.50 లక్షలపై ఇద్దరినీ కలిపి విచారించారు. రేవంత్ భార్య గీతను తీసుకెళ్లి లాకర్లు తనిఖీ చేశారు. కాగా, ఈ ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News