Supreme Court: రుతుస్రావ వయసున్న మహిళలు శబరిమలకు వెళ్లొచ్చా?: నేడు తేల్చనున్న సుప్రీంకోర్టు

  • నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా
  • ఇప్పటికే పలు కీలక కేసుల్లో తీర్పుల వెల్లడి
  • భక్తుల మనోభావాలు గౌరవించాలంటున్న ఆలయ పెద్దలు

మరో నాలుగు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేడు మరో కీలక కేసులో తీర్పును వెలువరించనున్నారు. కేరళలో ప్రసిద్ధి చెందిన శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల నడుమ వయసున్న మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ దాఖలైన పలు పిటీషన్లపై విచారణను పూర్తి చేసిన ధర్మాసనం నేడు తీర్పును వెలువరించనుంది.

ఘోటక బ్రహ్మచారి అయిన అయ్యప్ప, రుతుస్రావ పరిధిలో వయసున్న మహిళలను చూసేందుకు ఇష్టపడరని, ఈ ఒక్క దేవాలయం మినహా, మిగతా అన్ని అయ్యప్ప ఆలయాల్లోనూ మహిళలకు ప్రవేశం ఉందని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించాలని భక్తుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది.

చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖాన్ విల్కర్, ఇందూ మల్హోత్రా, చంద్రచూడ్ ల బృందం ఈ కేసును విచారించింది. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు మహిళల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా, కేరళ ప్రభుత్వం తొలుత వ్యతిరేకించి, ఆపై మహిళల ప్రవేశానికి సమ్మితిని తెలిపిన విషయం తెలిసిందే.

కాగా, గత మూడు రోజులుగా సుప్రీంకోర్టు పలు కీలక అంశాలపై తీర్పులను వెలువరిస్తోంది. ప్రతి విషయానికీ ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని, వివాహేతర సంబంధాలు నేరం కాదని, అయోధ్య అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తీర్పులు వెలువరించింది.

More Telugu News