Congress: సుప్రీంకోర్టు తన తీర్పుతో బీజేపీ చెంప చెళ్లుమనిపించింది: కాంగ్రెస్

  • ఆధార్‌ చట్టబద్ధతపై సుప్రీం తీర్పును స్వాగతించిన కాంగ్రెస్
  • బీజేపీకి చెంపపెట్టన్న అభిషేక్ మను సింఘ్వి
  • బయోమెట్రిక్ డేటా మోనిటైజేషన్‌లో ప్రభుత్వం విఫలమన్న కాంగ్రెస్

అన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరేమీ కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టబద్ధతపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ కీలక తీర్పును వెల్లడించింది. ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఆధార్ అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

ఆధార్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కాంగ్రెస్ ఇది బీజేపీకి చెంప పెట్టు అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి ట్వీట్ చేస్తూ.. సుప్రీం తన తీర్పుతో బీజేపీ చెంపను చాచిపెట్టి కొట్టిందన్నారు. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కోర్టు కొట్టివేయడాన్ని సంఘ్వి ప్రస్తావిస్తూ.. ఈ సెక్షన్ ప్రైవేటు వ్యక్తులు కూడా ఆధార్ వివరాలను సేకరించే అవకాశాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని తేలిందని, బయోమెట్రిక్ డేటాను మోనిటైజ్ చేయాలనుకున్న ప్రభుత్వం విఫలమైందని సింఘ్వి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More Telugu News