araku: అరకు ఘటనపై కీలక ఆధారాలు సేకరించాం: ఏపీ డీజీపీ ఠాకూర్

  • కిడారి, సోమను కాల్చి చంపడం దురదృష్టకరం 
  • కాల్పుల్లో పాల్గొన్న వారి ఆధారాలు దొరికాయి
  • నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం

అరకు ఘటనపై కీలక ఆధారాలు సేకరించామని ఏపీ డీజీపీ ఠాకూర్ అన్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ప్రాంతాన్ని ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ,  కిడారి, సోమలను కాల్చి చంపడం  దురదృష్టకరమని, ఘటనకు తామే బాధ్యత వహించాలని అన్నారు. కాల్పుల్లో పాల్గొన్న వారి ఆధారాలు దొరికాయని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

కిడారి, సోమ లను వారు ఎందుకు చంపారో దర్యాప్తులో తేలుతుందని, ఈ ఘటనపై మావోయిస్టుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదని అన్నారు. పోలీస్-మావోయిస్టుల మధ్య ఇది నిరంతర పోరాటమన్న ఠాకూర్, రామగూడ ఎన్ కౌంటర్ తర్వాత చాలాసార్లు ప్రతీకార చర్యలకు మావోయిస్టులు పథకం వేశారని, పోలీసులు  ఏడుసార్లు తప్పించుకున్నారని చెప్పారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సమస్యలు ఉన్నాయని, ఏపీ-ఒడిశా పోలీసుల మధ్య సమన్వయ లోపం వాస్తవమేనని అన్నారు. భవిష్యత్ లో కేంద్రం, ఏపీ, ఒడిశా పోలీసులు సమన్వయంతో పనిచేస్తారని ఠాకూర్ చెప్పారు. 

More Telugu News