Supreme Court: అన్నింటికీ ఆధార్ తప్పనిసరేమీ కాదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లకు అనుసంధానం అవసరం లేదు
  • స్కూల్ అడ్మిషన్లకు కూడా అవసరం లేదు
  • 38 రోజుల విచారణ అనంతరం తీర్పిచ్చిన అత్యున్నత న్యాయస్థానం 

అన్నింటికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం కీలక తీర్పిచ్చింది. ఆధార్ వివరాల పేరిట ప్రజల నుంచి తీసుకున్న సమాచారం చాలా స్వల్పమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్ల అనుసంధానంకు ఆధార్ అక్కర్లేదని పేర్కొంది. మొబైల్ సంఖ్యకు ఆధార్ తప్పనిసరి చేస్తూ డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) పేర్కొనడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

ప్రైవేటు వ్యక్తులకు, కంపెనీలకు ఆధార్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆధార్ అనుసంధానం, ఆధార్ చట్టబద్ధతపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. 38 రోజుల పాటు విచారణ సాగగా, దేశంలోకి చట్ట వ్యతిరేకంగా చొరబడిన వారు ఆధార్ లబ్ధిని పొందకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆధార్ చట్టాన్ని మనీ బిల్లుగా ఆమోదించవచ్చని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టంలోని 139ఏఏ ప్రకారం, ఐటీ రిటర్నుల దాఖలు సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించడం తప్పనిసరని తెలిపింది.

ఇక స్కూల్ అడ్మిషన్ల విషయంలో ఆధార్ పై స్పందిస్తూ, సెక్షన్ 7 కింద స్కూల్ అడ్మిషన్, విద్యార్థికిగానీ, అతని తల్లిదండ్రులకు గానీ దక్కే ప్రయోజనం ఏమీ లేదని, దీనివల్ల ఆధార్ సంఖ్య నమోదు తప్పనిసరేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆధార్ లేదని స్కూల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం నేరమని పేర్కొంది. సీబీఎస్ఈ, నీట్, యూజీసీ తదితరాలు ఆధార్ ను తప్పనిసరి చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది.

More Telugu News