West Bengal: 'అదిగదిగో అమ్మాయంటూ...' ఏకంగా రూ. 150 కోట్లు కొట్టేసిన బెంగాల్ బ్యాచ్... బాధితుల సంఖ్య వేలల్లో!

  • ఒక్కో కాల్ సెంటర్ నుంచి రోజుకు లక్ష సంపాదన
  • 20 కాల్ సెంటర్ల నుంచి రూ. 20 లక్షలు
  • హై ప్రొఫైల్ కస్టమర్లను ముగ్గులోకి దించేది అనితా డే
  • గూగుల్ ఫొటోలను అప్ లోడ్ చేసి దందా

కవ్విస్తూ, మత్తుగా అమ్మాయి మాట్లాడుతుంటే, ఇట్టే పడిపోయిన పురుషులు... పశ్చిమ బెంగాల్ కేంద్రంగా సాగిన డేటింగ్ ముఠాకు ఏకంగా రూ. 150 కోట్లు సమర్పించేసుకున్నారు. మూడు వెబ్ సైట్లు, నాలుగు ఫోన్ నంబర్లతో ఈ ముఠా రెండేళ్లలోనే ఇంత భారీ మొత్తాన్ని దండుకుందని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ తెలియజేశారు.

తమ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నవారి నుంచి అందినంత దండుకోవడమే వీరి పనని, డేటింగ్ చేయాలన్న అబ్బాయిల బలహీనతే పెట్టుబడిగా దందాను నడిపించారని అన్నారు. అందమైన, సెక్సీ ఫొటోలను గూగుల్ సెర్చ్ ద్వారా సేకరించి, వారిని డేటింగ్ కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలుగా చూపించిన ఈ ముఠా, తమ బుట్టలో పడిన వారి నుంచి తొలుత వేలల్లో, ఆపై లక్షల్లో డబ్బు దండుకుంటుందని తెలిపారు.

హై ప్రొఫైల్ కస్టమర్లతో ప్రధాన నిందితురాలు అనితా డే స్వయంగా మాట్లాడి, వారికి తన అనర్గళమైన ఆంగ్ల పరిజ్ఞానంతో కబుర్లు చెప్పి, మోసం చేస్తుందని అన్నారు. ఒక్కో కాల్ సెంటర్ నుంచి రోజుకు లక్ష రూపాయల చొప్పున రోజుకు రూ. 20 లక్షలు వీరి సంపాదనని, ఎనిమిది బ్యాంకు ఖాతాలను తెరచి డబ్బులు వాటిల్లో వేయించుకునేవారని అన్నారు.

బాధితుల్లో చాలా మంది బయటపడితే తమ పరువు పోతుందని, ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని, ఈ తరహా సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సజ్జన్నార్ సూచించారు. కాగా, వీరి చేతిలో మోసపోయిన ఓ హైదరాబాద్ యువకుడి ఫిర్యాదుతో పశ్చిమ బెంగాల్ లో దాడులు జరిపిన సైబరాబాద్ పోలీసులు, ఇద్దరిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం నగరానికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News