Sushil kumar Modi: 15 రోజులపాటు నేరాలకు పాల్పడొద్దంటూ బీహార్ ఉప ముఖ్యమంత్రి పిలుపు.. వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!

  • సుశీల్ మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్న విపక్షాలు
  • 15 రోజుల తర్వాత నేరాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్టా? అని ప్రశ్న
  • తన వ్యాఖ్యలను సమర్థించుకున్న సుశీల్ కుమార్ మోదీ

బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. పితృపక్షం పూజల ప్రారంభం సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ.. మరో 15 రోజుల పాటు నేరాలకు పాల్పడకూడదంటూ నేరగాళ్లకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. ‘సిగ్గులేకుండా నేరగాళ్లను ఎలా అభ్యర్థిస్తున్నారో చూడండి’ అని పేర్కొన్నారు. 15 రోజులపాటు నేరాలు చేయొద్దంటే ఆ తర్వాత కిడ్నాపులు, మానభంగాలు, లూటీలు, హత్యలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్టా? అని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ.. తాను ఇచ్చిన పిలుపులో అంతగా ఏమీ లేదని, తన పిలుపు నేరగాళ్లను నేరపూరిత చర్యల నుంచి దూరంగా ఉంచుతుందని సమర్థించుకున్నారు.

More Telugu News