Afghanistan: రాహుల్, రాయుడు మెరిసినా వృథా.. టైగా ముగిసిన భారత్-ఆఫ్గాన్ మ్యాచ్

  • నరాలు తెగే టెన్షన్‌కు గురిచేసిన మ్యాచ్
  • ఆశలు రేపి ఉసూరు మనిపించిన జడేజా
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షాజాద్

ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగి టైగా ముగిసింది. చివరల్లో జడేజా ఫోర్ కొట్టి భారత శిబిరంలో ఆశలు రేపినా చివరి ఓవర్ ఐదో బంతికి ఆల్ రౌండర్ జడేజా ఔటవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఓపెనర్లు రాహుల్, రాయుడు సిక్సర్లతో చెలరేగారు.  రాహుల్ 55 బంతుల్లో, రాయుడు 43 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన రాయుడు (57) క్యాచ్ ఇచ్చి అవుటవగా, ఆ తర్వాత కాసేపటికే రాహుల్ (60) కూడా అవుటయ్యాడు.

ఆ తర్వాత ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. ధోనీ(8), పాండే (8), జాదవ్‌ (19) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో నిలదొక్కుకుని భారత శిబిరంలో ఆశలు పెంచిన కార్తీక్ (44) కూడా అవుటవడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు చేరుకుంది. చివరి రెండు బంతుల్లో భారత్ విజయానికి ఒక పరుగు అవసరం కాగా, చివరి ఓవర్ ఐదో బంతికి జడేజా ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ టైగా ముగిసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ షాజాద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాదిన షాజాద్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 12 ఓవర్లలో ఆఫ్ఘాన్ స్కోరు 65 పరుగులు కాగా, అందులో 56 పరుగులు షాజాద్‌వే కావడం గమనార్హం. అయితే, స్పిన్నర్ల రంగ ప్రవేశంతో ఆఫ్ఘాన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది.

12 ఓవర్ల వద్ద 65/0తో బలంగా కనిపించిన ఆఫ్ఘాన్ జట్టు 15.3 ఓవర్లకు 82/4తో కష్టాల్లో పడింది. అయితే, షాజాద్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. 88 బంతుల్లోనే వన్డేల్లో తన ఐదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరికి జాదవ్ బౌలింగ్‌లో షాజాద్ అవుటవడంతో పరుగుల ప్రవాహానికి కళ్లెం పడింది. చివర్లో నబి (64) కూడా చెలరేగడంతో ఆఫ్ఘాన్ 252 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా మహమ్మద్ షాజాద్ ఎంపికయ్యాడు. కాగా, భారత్ ఇప్పటికే ఫైనల్ చేరింది. నేడు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌లో భారత్‌తో తలపడుతుంది.   

More Telugu News