congress: ‘ప్రాజెక్టు శక్తి’ కాంగ్రెస్ కార్యకర్తల కంఠ ధ్వని కావాలి: కొప్పుల రాజు

  • ‘కాంగ్రెస్’ కార్యక్రమాల గురించి కార్యకర్తలకు సందేశాలు
  • అందుకోసమే రూపొందించిన ‘ప్రాజెక్టు శక్తి’
  • విజయవాడలో దీనిని ప్రారంభించిన ఊమెన్ చాందీ, ఏఐసీసీ కోర్ సభ్యుడు కొప్పుల రాజు  

ప్రాజెక్టు శక్తి దేశంలోని కార్యకర్తల కంఠ ధ్వని కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్టును అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రారంభించిందని ఏఐసీసీ కోర్ సభ్యుడు కొప్పుల రాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన ‘ప్రాజెక్టు శక్తి’ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీ, కె. రాజు తదితరులు పాల్గొని ప్రారంభించారు. తొలుత విజయవాడ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ‘ప్రాజెక్టు శక్తి’ కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో దీని గురించి వివరించేందుకు ఓ వీడియోను ప్రదర్శించారు.
‘ప్రాజెక్టు శక్తి’ గురించి ఏఐసీసీ నేషనల్ కో ఆర్డినేటర్లు శశాంక్ శుక్లా, స్వప్న   వివరించారు. అనంతరం రఘువీరారెడ్డి, పలువురు నేతలను ప్రాజెక్టు శక్తిలో ఎస్ఎంఎస్ ద్వారా భాగస్వాములను చేశారు.

ఈ సందర్భంగా కె.రాజు మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల గురించి దేశంలోని ప్రతి గ్రామం, మండలం, బ్లాక్, టౌన్, జిల్లా పార్టీ కార్యకర్తలకు ముఖ్య సందేశాలను నేరుగా అందించేందుకే ‘ప్రాజెక్టు శక్తి’ని ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీలో దీనిని ప్రారంభించామని, దాదాపు దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది కార్యకర్తలు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు చెప్పారు.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విధిగా ప్రాజెక్టు శక్తిలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఇందుకు వారి ఓటర్ ఐడి నెంబర్ ను తమ ఫోన్ నెంబర్ ద్వారా 8108048888 కు  ఎస్ఎంఎస్ పంపించాలని, అనంతరం, ప్రాజెక్టు శక్తి నుంచి వారికి ఎస్ఎంఎస్ వస్తుందని చెప్పారు.  

More Telugu News