Honor Killing: అమృతకు మద్దతిచ్చినందుకు మంచు మనోజ్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు... ట్విట్టర్ లో స్పందన!

  • పరువు హత్యపై స్పందించిన మంచు మనోజ్
  • ఓ వర్గం నెటిజన్ల నుంచి వ్యక్తిగత విమర్శలు
  • ట్విట్టర్ లో లేఖను పోస్టు చేసిన మనోజ్

మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య తరువాత, హీరో మంచు మనోజ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట ఓ వర్గం ఆయన్ను ఏకిపారేస్తుండగా, మనోజ్ మరోసారి స్పందిస్తూ, ఓ లేఖను విడుదల చేశాడు.

 తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో అర్థం చేసుకోవాలని కోరాడు. పరువు హత్యపై తాను ఓ వీడియోను విడుదల చేస్తూ, పదవ తరగతిలో ఉన్న వారికి కులాలు, హోదా వంటివి తెలియవన్న ఉద్దేశంతో అలా మాట్లాడానని, దాన్ని గుడ్డిగా వ్యతిరేకించ వద్దని విజ్ఞప్తి చేశాడు. కొందరు హత్యను సమర్థిస్తున్నారని, వారిని చూసి తాను బాధపడుతున్నానని అన్నాడు. అతి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ అంటూ మరో మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదని చెప్పాడు.

ప్రతి ఒక్కరికీ ప్రేమించే వయసు వస్తుందని, ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుంటే, వారి తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద మనసు చేసుకుని మద్దతుగా నిలవాలే తప్ప, హింసాత్మక చర్యలకు దిగరాదని కోరాడు. తన వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకోవాలని కోరుతున్నానని, బిడ్డలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండదన్న కోణంలో చూడవద్దని కోరిన మంచు మనోజ్, తన వ్యాఖ్యలను అక్కడక్కడా మాత్రమే చదివి ఓ అభిప్రాయానికి రావద్దని అన్నాడు. మిమ్మల్ని మీరు ఇడియట్ లుగా చేసుకుని, తనను కూడా ఇడియట్ ను చేయవద్దన్నాడు. మానవత్వం పరిమళించాలని, కులాలు, మతాలు, ప్రాంతాలు హరించుకుపోవాలని అన్నాడు.

తన కుటుంబాన్ని, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వారికి ఓ సూచన చేస్తూ, తనను గౌరవించక పోయినా ఫర్వాలేదని, మహిళలపై గౌరవాన్ని చూపాలని, మీకూ ఓ తల్లి, సోదరి, భార్య, కుమార్తె ఉన్నారన్న విషయాన్ని గుర్తెరగాలని హితవు పలికాడు.

More Telugu News