mothkpalli: ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: మోత్కుపల్లి నర్సింహులు

  • ఆలేరు ప్రజలు మరోసారి నన్ను దీవిస్తానంటున్నారు
  • 27న ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో బహిరంగ సభ
  • మోదీని కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి  చంద్రబాబే

తెలంగాణలో జరగనున్న వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లా ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని అన్నారు. కేసీఆర్ చాలా మందిని దగ్గరకు తీశారని, తాను దళితుడిని కావడం వల్లేనేమో ఆయన తనను దూరంపెట్టి ఉంటారని అభిప్రాయపడ్డారు.

గతంలో తాను ఆలేరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తనను ప్రజలు గెలిపించారని గుర్తుచేసుకున్నారు. ఆలేరు ప్రజలు మరోసారి తనను దీవిస్తామని చెబుతున్నారని, అందుకే, త్వరలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ నెల 27న ఆలేరులో ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.


ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదుర్చుకోవడంపై మోత్కుపల్లి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో జతకడుతున్నారని, ఆ జతకట్టే దశలో పదో ఇరవయ్యో సీట్లు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాటు మోదీని పొగిడిన చంద్రబాబు తన అవసరాలను వెళ్లదీసుకున్నారని, ఇప్పుడు రాహుల్ గాంధీని ఆయన పొగుడుతున్నారని, మోదీని కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబేనని విమర్శించారు.

More Telugu News