jagga reddy: ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే కేసీఆర్ లక్ష్యం: జైలు నుంచి విడుదలైన జగ్గారెడ్డి

  • నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు తప్పుడు కేసు
  • కేసీఆర్ తన జీవితంలో ఏ తప్పూ చేయలేదా?
  • కేసీఆర్ పై ఎలాంటి ఆరోపణలు లేవా?

చంచల్ గూడ జైలు నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదలయ్యారు. మానవ అక్రమ రవాణా కేసులో ఇటీవల అరెస్టయిన ఆయన్ని చంచల్ గూడ జైలుకు పంపిన విషయం తెలిసిందే. సికింద్రాబాదు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

అనంతరం, గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పద్నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడారని మండిపడ్డారు. అసలు, ఈ కేసులో తన పేరు లేదని, ఈ తప్పుడు కేసు నుంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను మానసికంగా దెబ్బతీయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని అన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులను ఇబ్బందిపాలు చేస్తున్నారని, కేసీఆర్ ని ఎవరు ప్రశ్నించొద్దనే రీతిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు.  

‘కేసీఆర్ జీవితంలో ఏ తప్పూ చేయలేదా? కేసీఆర్ పై ఎలాంటి ఆరోపణలు లేవా? మీ నాయకులందరిపైనా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో, రాష్ట్రంలో తప్పులు చేయని నాయకులే లేనట్టు.. జగ్గారెడ్డే తప్పుచేసినట్టుగా జైల్లో పెట్టారు. ప్రతిపక్ష నాయకులందరిని ఈ ప్రభుత్వం జైల్లో పెడితే.. నష్టపోయేదెవరు? ప్రజలేగదా! ఒక రాజకీయ పార్టీని ఇంకో రాజకీయ పార్టీ ఇబ్బంది పెట్టడం మంచి సంప్రదాయం కాదని కేసీఆర్ కుటుంబానికి తెలియజేస్తున్నాను.

నాలుగేళ్ల నుంచి లేని ఈ కేసు ఎలక్షన్ల అప్పుడే ఎందుకొచ్చింది? ఇప్పుడే నేను తప్పు చేసినట్టు అనిపించిందా? ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వాళ్లందరిని బ్లాక్ మెయిల్ చేస్తూ జైల్లో పెడితే.. ఎవరము ధైర్యం చేయలేము. ఎందుకంటే, మాకూ కుటుంబం, భార్యాపిల్లలు ఉన్నారు. అసలు, రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యం ఎటుపోయింది! ప్రజా సమస్యలపై మాట్లాడకపోతే ప్రజలే నష్టపోతారు. ఈ విషయాన్ని ప్రజలే గమనించుకోవాలి.పోలీస్ అధికారులు కూడా గమనించాలి.

 దయచేసి.. పోలీస్ అధికారులు కూడా పక్షపాతంగా పోవద్దు.. ఆలోచన చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల సంక్షేమం కోసం పనులు చేద్దాం.. పోటీపడదాం. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులతో, అరెస్టులతో నాయకులను భయభ్రాంతులను చేసి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వానికి తెలియజేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News