CHILD MARRIAGE: ‘నా పెళ్లి ఆపించండి సార్’ అంటూ పోలీసులను ఆశ్రయించిన ఆరో తరగతి బాలిక!

  • ఆరు నెలలుగా సంబంధాలు చూస్తున్న తండ్రి
  • చదువుకుంటానన్నా వినని వైనం
  • పోలీసుల చొరవతో సమస్య పరిష్కారం

తండ్రి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడు. తాను చదువుకుంటానని చెప్పినా వినడం లేదు. ఇంట్లో అమ్మ ఏమో నాన్న మాటకు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంది. దీంతో తీవ్రంగా కలత చెందిన ఓ మైనర్ బాలిక(13) పోలీసులను ఆశ్రయించింది. చివరికి  పోలీసులు, పిల్లల సంక్షేమ కమిటీ సభ్యుల చొరవతో ఆ వివాహం ఆగిపోయింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది.

దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో బాధిత బాలిక(13) ఆరో తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో అమ్మాయికి వివాహం చేసేందుకు ఆమె తండ్రి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. గత ఆరు నెలలుగా ఇదే తంతు సాగుతోంది. దీంతో బాలిక తీవ్రమైన ఒత్తిడికి లోనయింది. తాను చదువుకుంటానని చెప్పినా తండ్రి వినకపోవడం, అమ్మ కూడా అడ్డుచెప్పకపోవడంతో ఏం చేయాలా? అని ఆలోచించింది.

 శనివారం ఆమె తల్లిదండ్రులు మరో సంబంధం మాట్లాడేందుకు బయలుదేరారు. దీంతో బాలిక తన సమస్యను పోలీసులకే చెప్పుకోవాలని నిర్ణయించింది. తనకు తోడుగా రావాలని స్నేహితురాలిని కోరగా ‘అమ్మో భయం.. నేను రాను’ అని ఆమె చెప్పింది. దీంతో ఒంటరిగానే స్కూలు యూనిఫాంలో పుస్తకాల సంచిని మోసుకుంటూ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవంతల పోలీస్ స్టేషన్ కు చేరుకుంది.

అక్కడ ఈ అమ్మాయిని చూసిన కానిస్టేబుల్ ఇంటికి వెళ్లిపొమ్మని సూచించాడు. అయితే స్టేషన్ అధికారిని కలుసుకున్నాకే తిరిగి వెళతానని బాలిక స్పష్టం చేసింది. చివరికి స్టేషన్ ఆఫీసర్ సుభాష్ ను కలుసుకుని, విషయం చెప్పి, ‘దయచేసి నాకు సాయం చేయండి సార్. ఈ పెళ్లిని ఆపేయండి. నాకు చదువుకోవాలని ఉంది’ అని వేడుకుంది.

ఆయన వెంటనే పిల్లల సంక్షేమ కమిటీ అధికారులను పిలిచి, బాలిక ఇంటికి పంపారు. వివాహాన్ని మానుకోవాల్సిందిగా వారు తండ్రికి సూచించారు. అయితే అతను ఇందుకు అంగీకరించలేదు. దీంతో పెళ్లి చేస్తే కేసులు పెడతామనీ, జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. అధికారుల వార్నింగ్ తో వెంటనే మెత్తబడ్డ సదరు తండ్రి.. బాలిక మేజర్ అయ్యేవరకూ పెళ్లి చేయబోనని రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. దీంతో సమస్య పరిష్కారమైంది.

More Telugu News