drugs: గుంటూరు జిల్లాలో 17 రకాల నకిలీ మందుల చలామణి!

  • ప్రమాదకర ఔషధాలకు అడ్డాగా జిల్లా కేంద్రం
  • మధుమేహం, బీపీ, యాంటీబయాటిక్‌, కడుపుబ్బరం మందులే అధికం
  • రాజస్థాన్‌ నుంచి సరఫరా అవుతున్నట్లు అనుమానం

గుంటూరు నకిలీ మందుల అడ్డాగా మారింది. దాదాపు 17 రకాల నకిలీ మందులు మార్కెట్‌లో చలామణిలో ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన సమస్యలైన మధుమేహం, బీపీ, యాంటీ బయాటిక్‌, కడుపుబ్బరం, ఎముకలకు శక్తినిచ్చే మందుల్లోనే అధికంగా కల్తీ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సిప్లా, అరిస్టో, ఆల్కెమ్‌, సన్‌ఫార్మా తదితర ప్రముఖ కంపెనీ లేబుళ్లతోనే ఈ నకిలీలు చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి ఈ మందులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతున్నాయని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానిక అధికారులు ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారని సమాచారం.

కొద్దికాలం క్రితం గుంటూరు, విజయవాడ నగరాల్లో ఆల్ట్రాసెట్‌తో సహా ప్రముఖ కంపెనీలకు చెందిన 8 రకాల నకిలీలను అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వీటిని తయారు చేసినట్లు తెలుసుకున్నారు. రూర్కీలోని మూడు ఫ్యాక్టరీల్లో ఈ మందులు తయారై రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ ఉత్తరప్రదేశ్‌తో పాటు ఏపీలో చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల అధికారులు రూర్కీ ఫ్యాక్టరీలపై దాడులు చేసి మూడు ఫ్యాక్టరీలను సీజ్‌ చేశారు.

అయితే  అంతకుముందే రూర్కీలో తయారైన నకిలీ మందులు గుంటూరు చేరినట్లు సమాచారం ఉన్నా స్థానిక అధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. బయటపడితే ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు పడతాయన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు మిన్నకున్నారని సమాచారం. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ జేడీ వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ నకిలీలు ఉన్నట్లు సమాచారం అందిందని, వాటి ఏరివేత ప్రారంభించామని తెలపడం గమనార్హం.

More Telugu News