Telangana: విశాఖ ఏజెన్సీలో కాల్పుల ఘటనతో తెలంగాణలో హైఅలర్ట్‌!

  • అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశం
  • ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సమీక్ష
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు

విశాఖ జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను కాల్చిచంపిన ఘటన నేపథ్యంలో తెలంగాణలో హైఅలర్ట్‌ ప్రకటించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి హుటాహుటిన ఇంటెలిజెన్స్‌, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, మావోయిస్టు కదలికలు, సరిహద్దులో ప్రభావం వంటి అంశాలపై సమీక్షించారు.

అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు పంపాలని ఆదేశించారు. చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో ఉన్న బేస్‌ క్యాంపుల్లోని సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ సదా అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలకు భద్రత కట్టుదిట్టం చేయాలని ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు.

ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో నేతలంతా తమ జిల్లాల్లో మోహరించారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాల నేతలను అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరించింది. నాయకులు మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.  పోలీసు భద్రతతోనే పర్యటించాలని సూచించారు. 

More Telugu News