maldives: మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి ఇబ్రహీం ఘనవిజయం.. చిత్తుగా ఓడిన భారత వ్యతిరేకి యమీన్!

  • ఇబ్రహీంకు పట్టం కట్టిన మాల్దీవుల ప్రజలు
  • భారీగా నమోదైన పోలింగ్
  • ఫలితాలను ప్రకటించిన ఎన్నికల సంఘం

భారత్ కు పంటికింద రాయిలా మారిన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ కు అక్కడి ప్రజలు షాక్ ఇచ్చారు. ఈ రోజు వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఇబ్రహీమ్ మహమద్ సోలీహ్ కు పట్టం కట్టారు. మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇబ్రహీంకు 58.3 శాతం ఓట్లు దక్కినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఇబ్రహీం విజయంతో ఆయన వర్గీయులు, మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

కొన్నిరోజుల క్రితం సంక్షోభం తలెత్తడంతో యమీన్ మాల్దీవుల్లో ఎమర్జెన్సీని విధించారు. అక్కడితో ఆగకుండా పలువురు రాజకీయ నేతలు, అధికారులతో పాటు జడ్జీలను అరెస్ట్ చేయించారు. యమీన్ దెబ్బకు మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నారు. తాజాగా పూర్తిగా భారత్ వ్యతిరేకిగా మారిన యమీన్.. చైనాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా గతంలో అందించిన హెలికాప్టర్లను వెనక్కు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం భారత్ ను కోరింది. 2.62 లక్షల జనాభా మాత్రమే ఉన్న మాల్దీవుల్లో ఈసారి ఏకంగా 88 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.

More Telugu News