Ameerpet: నేటి నుంచి అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులు!

  • ట్రాఫిక్ కష్టాలు తీర్చే అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో రైలు
  • మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
  • 3 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి

హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చే అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో రైలు మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించనుండగా, అనంతరం 3 గంటల సమయంలో ప్రయాణికులతో తొలి రైలు ఎల్బీ నగర్ బయలుదేరుతుంది. ఇప్పటికే మియాపూర్ నుంచి నాగోల్ వరకూ మెట్రో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రయాణికులు అమీర్ పేట దాటి వెళ్లాలంటే, దిగి మరో రైలును ఎక్కాల్సివుంటుంది. అయితే ఇకపై మియాపూర్ నుంచి బయలుదేరే రైళ్లు నేరుగా ఎల్బీ నగర్ కు చేరనున్నాయి.

ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లు ఉండగా, ఎల్బీ నగర్ లో బయలుదేరే వ్యక్తి, మియాపూర్ కు 52 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకూ ఓ రైలు ఉంటుందని, ఇవి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. ఈ రూట్ అత్యంత రద్దీగా ఉంటుందని, ముఖ్యంగా నాంపల్లి, ఎంజీబీఎస్ ల నుంచి వచ్చి వెళ్లే లక్షలాది మందికి ఉపయుక్తకరమని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ మార్గంలో కేవలం ఎల్బీ నగర్, మూసారంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట స్టేషన్ల వద్ద మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉండటం గమనార్హం.

More Telugu News