Andhra Pradesh: బాబూ జీవీఎల్.. ఈ లేఖను ఓసారి చూడయ్యా: ఐరాస లేఖను విడుదల చేసిన చంద్రబాబు సర్కారు

  • జీవీఎల్ ఆరోపణల నేపథ్యంలో లేఖ విడుదల చేసిన ప్రభుత్వం
  • జీవీఎల్ జీర్ణించుకోలేకపోతున్నారన్న బుద్ధా వెంకన్న
  • కళ్లుండీ చూడలేని కబోది జీవీఎల్ అన్న ఎమ్మెల్సీ

ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం తిప్పికొట్టింది. జీవీఎల్ డిమాండ్ చేసినట్టుగానే ఐరాస నుంచి వచ్చిన ఆహ్వాన లేఖను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం పంపిన ఈ ఆహ్వాన లేఖను మీడియా సమక్షంలో బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యం, చంద్రబాబు ముందు చూపు ప్రశంసనీయమని ఐరాస తన లేఖలో అందులో పేర్కొంది. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను సదస్సు వినాలని భావిస్తోందని ఆహ్వానంలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం ఐరాస ఆహ్వాన లేఖను విడుదల చేసిన అనంతరం విజయవాడలో ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న మాట్లాడారు. జీవీఎల్ కళ్లుండీ చూడలేని కబోది అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయనకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తప్ప మరెవరూ కనిపించడం లేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం తెలుగువారికి దక్కినందుకు అభినందించాల్సింది పోయి ఇలా అసూయ పడడం సరికాదన్నారు. తన వద్దకు వస్తే లేఖ ఇస్తానని, అర్థం కాకుంటే ఆయన తన మనవడితో చదివించుకోవచ్చని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజలను అవమానించేలా మాట్లాడిన ఆయన క్షమాపణలు చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.

More Telugu News