stroke: కనీస వ్యాయామం చేసినా స్ట్రోక్ ముప్పు తగ్గించుకోవచ్చు

  • చిన్న వయసులోనే చుట్టుముడుతున్న జబ్బులు
  • 35 నిమిషాలు నడిస్తే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి విముక్తి
  • వ్యాయామ ప్రాధాన్యాన్ని చెప్పిన పరిశోధక బృందం

రోజుకు కనీసం 35 నిమిషాలు నడవడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి విముక్తి పొందవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. పని ఒత్తిడితో చాలా మందికి అసలు వ్యాయామంపైనే దృష్టి పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, చక్కెర వ్యాధి వంటి ఎన్నో జబ్బులు మనిషి శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. దీంతో వ్యాయామ ప్రాధాన్యాన్ని ప్రయోగాత్మకంగా గుర్తించింది స్వీడన్‌కు చెందిన గొతన్ బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం. ఇది 73ఏళ్ల ఉండి స్ట్రోక్‌కు గురైన మొత్తం 925 మందిపై పరిశోధన చేసింది. దీని ద్వారా పలు విషయాలను వెల్లడించింది.

 వారానికి కనీసం నాలుగు గంటల చొప్పున నడిచే వారికి స్ట్రోక్ తీవ్రత బాగా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక వారానికి కనీసం రెండు గంటలపాటైనా పరిగెత్తడం, ఈత వంటి కసరత్తులు చేస్తే స్ట్రోక్ తీవ్రతను బాగా ఎదుర్కోవచ్చునని స్పష్టం చేసింది. వీరు చేసిన పరిశోధనలో 481 మంది ఎలాంటి వ్యాయామాలు చేయని వారుండగా... 384 మంది నడక వ్యాయామం చేసేవారు.. 59 మంది ఓ మోస్తరు వ్యాయామం చేసేవారు వున్నారు.

 వీరిలో వ్యాయామం చేయని వారు 73శాతం స్ట్రోక్‌కి గురయ్యారు. నడక వ్యాయామం చేసే వారికి 85 శాతం తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. ఓ మోస్తరు వ్యాయామం చేసే వారిలో 89శాతం తేలిక పాటి స్ట్రోక్ వచ్చింది. ఈ సందర్భంగా పరిశోధకురాలు కేథరినా ఎస్‌.సన్నర్‌ హాగెన్‌ మాట్లాడుతూ రోజూ కనీస శారీరక వ్యాయామం చేసినా భవిష్యత్తులో వచ్చే స్ట్రోక్‌ ముప్పును చాలా వరకూ తగ్గించుకోవచ్చని తమ పరిశోధన తేల్చిందని చెప్పారు.

More Telugu News