Pakistan: మరోసారి బయటపడిన పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరి: భారత్‌

  • జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం
  • ఆ దేశ ప్రధాని అసలు రూపం బయటపడిందని వ్యాఖ్య
  • విదేశాంగ మంత్రుల భేటీ రద్దు

పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరిపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం తన తీరు మార్చుకోలేదని ఎండగట్టింది. ఓ వైపు నూతన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శాంతి మంత్రం పఠిస్తూ, మరోవైపు జమ్ము, కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడడం ద్వారా తన అసలు నైజాన్ని బయటపెట్టుకున్నారని మండిపడింది. లేఖలు, మాటల ద్వారా శాంతి పాఠాలు చెబుతూ, అదే సమయంలో ఉగ్రవాది బుర్హాన్‌ వనీని కీర్తిస్తూ పాక్‌ స్టాంప్‌ విడుదల చేయడంతోనే సమస్యల పరిష్కారం విషయంలో ఆ దేశ వైఖరి ఏమిటో స్పష్టమైపోయిందని తెలిపింది.

పాకిస్థాన్‌ తీరును నిరసిస్తూ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్‌, షా మొహమూద్‌ ఖురేషీ మధ్య జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. ‘చర్చల ప్రతిపాదన వెనుక పాకిస్థాన్‌ దుష్టపన్నాగం బయటపడింది. ఆ దేశం వైఖరిలో ఎటువంటి మార్పులేదని ప్రపంచానికి వెల్లడైంది. ఈ వాతావరణంలో చర్చలు జరపడం అర్థరహితం’ అని భారత్‌ విదేశీ వ్యవహారా శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ కు చెందిన ముగ్గురు పోలీసులను అపహరించి దారుణంగా చంపడంతో సరిహద్దులో మళ్లీ వాతావరణం వేడెక్కింది. 

More Telugu News