Asia cup: మళ్లీ రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. బంగ్లా‌దేశ్‌ను ఆటాడుకున్న భారత్!

  • వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన
  • సూపర్-4లో బంగ్లాదేశ్‌పై అలవోక విజయం
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జడేజా

ఆసియా కప్‌లో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. హాంకాంగ్, పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించిన టీమిండియా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 174 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మరో 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు విసిరిన నిప్పులు చెరిగే బంతులకు బంగ్లా బ్యాట్స్‌మన్ ఎదురొడ్డి నిలవలేకపోయారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా బంతులను ఎదురొడ్డే సాహసం చేయలేక వికెట్లు సమర్పించుకున్నారు. అతడికి భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా తోడవడంతో వికెట్లు పేకమేడల్లా రాలాయి.  బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లలో మెహది హసన్ (42) ఒక్కడే కాసేపు పోరాడాడు. కెప్టెన్ మోర్తాజా 26, మహ్మదుల్లా 25 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. భువీ, బుమ్రా చెరో మూడు వికెట్లు తీసుకోగా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 36.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోమారు రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, 5 ఫోర్లతో 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శిఖర్ ధవన్ 40, అంబటి రాయుడు 13, మాజీ సారథి ధోనీ 33 పరుగులు చేశారు.

More Telugu News