పార్టీ నాశనమవుతుందనే ఆవేదనతోనే మాట్లాడుతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

21-09-2018 Fri 20:03
  • నేను మాట్లాడిన మాటలన్నీ కార్యకర్తల ఆవేదనే
  • నా వ్యాఖ్యలను కొంతమంది ఓర్వలేకపోయారు
  • నేను ఇప్పటికీ ‘కాంగ్రెస్’లోనే ఉండాలనుకుంటున్నా
తనకు ఎలాంటి పదవులక్కర్లేదని, పార్టీ నాశనమవుతుందనే ఆవేదనతోనే మాట్లాడుతున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కుంతియాపై  చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ అధిష్ఠానం జారీ చేసిన షోకాజ్ నోటీసులపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షోకాజ్ నోటీసులకు రెండు రోజుల సమయం అవసరం లేదని, రెండు గంటల్లో సమాధానం చెబుతానని అన్నారు.

తాను మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన అని, తాను ఈవిధంగా మాట్లాడడాన్ని కొంత మంది ఓర్వలేక పోవడం వల్లే తనకు షోకాజ్ నోటీసులిచ్చారని విమర్శించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నానని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా పార్టీకి నష్టం కలిగించలేదని, కనువిప్పు కలిగించానని అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తిని ఉద్దేశించో, పార్టీకి నష్టం చేయాలనో ఈ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

ఏ విధంగా సీఎం అవ్వాలా? అని అనుకుంటున్న వారే తప్ప, పార్టీని గెలిపించే వారు కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రాహుల్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.