Chandrababu: కేంద్రం తప్పులకు ఏపీ ప్రజలకు నష్టం కలిగించొద్దు: సీఎం చంద్రబాబు

  • ఆర్ధిక శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం
  • 15వ ఆర్థిక సంఘానికి అందించే వినతిపై సమీక్ష
  • ఏపీికి సరైన న్యాయం జరిగేలా చూడాలి 

విభజన నష్టం నుంచి నాలుగేళ్లయినా ఏపీ తేరుకోలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఆర్థికశాఖ అధికారులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘానికి అందించే వినతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,15వ ఆర్థిక సంఘం ద్వారా ఏపీకి సరైన న్యాయం జరిగేలా చూడాలని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దాలని వినతిపత్రంలో కోరాలని సూచించారు.

భౌగోళిక ప్రాతిపదికన ఆస్తులు, జనాభా ప్రాతిపదికన అప్పులు పంచారని, విభజన జరిగి నాలుగేళ్లయినా ఏపీ పునర్విభజన చట్టం అంశాలను అమలు చేయలేదని, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్రతిపత్తి ఇవ్వలేదని, రాజధాని నిర్మాణానికి ఇచ్చింది అతిస్వల్పమని అన్నారు. విభజనకు ముందు 13 జిల్లాల రాబడి, ఖర్చుల గురించి సరైన లెక్కలు లేవని, 14వ ఆర్థిక సంఘం వేసిన అంచనాలు తప్పాయని, కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వ్యవయాధారిత ప్రాంతమని, పారిశ్రామిక రంగం రాబడి అతిస్వల్పమని అన్నారు.

వెనుకబడిన జిల్లాలకూ అరకొర నిధులిచ్చారని, 14వ ఆర్థిక సంఘం వేసిన అంచనా రాబడి రాలేదని, ఆ అంచనాల కన్నా రుణభారం అధికమైందని అన్నారు. పొరుగు రాష్ట్రంలో సేవా రంగంలో వృద్ధి శాతం 8 శాతం ఉంటే, ఏపీలో 2 శాతం కూడా లేదని, సేవా రంగంలో ఏపీకి రాబడి పెరిగేలా చేయూత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.

స్వయంకృషితో నాలుగేళ్లలో ఆదాయాలు పెంచుకున్నామని, దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సంతోషం వ్యక్తం చేశారు. ఎంత కష్టపడ్డా రాష్ట్ర నిర్మాణ సమస్యలే (స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ప్రతిబంధకాలయ్యాయని, ఏపీ ఆర్థిక పురోగతికి బాటలు వేయాల్సిన బాధ్యత 15వ ఆర్థిక సంఘానిదేనని, రూ.5 లక్షల కోట్లు ఇవ్వాలని విభజనకు ముందే కేంద్రానికి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

రేపు మరో 3 ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ నాటికి 40 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, ఈ వివరాలను 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చే నివేదికలో పొందుపరచాలని, అన్ని అంశాలతో ప్రజెంటేషన్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర పన్నుల్లో వాటాల పంపిణీకి 2011 జనాభా ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని, 1971 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవాలని, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో మేలు చేయాలని కోరారు. 1999-2004 మధ్య కాలంలో ఏపీలో జనాభాను నియంత్రించామని, నాడు ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం పెంచి, ఆర్థిక పురోగతి సాధించామని, అందుకు ప్రతిగా ఇప్పుడు 2011 సెన్సెస్ పేరుతో ఆర్థిక నష్టం చేయరాదని కోరారు.
 
ఎంత కష్టపడ్డా రాష్ట్ర నిర్మాణ సమస్యలే (స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్) ప్రతిబంధకాలు అయ్యాయని, చేయాల్సిన సహాయం కేంద్రం అందించలేదని, నెరవేర్చాల్సిన హామీలు నెరవేర్చలేదని పునర్విభజన చట్టంలో అంశాలను అమలు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించినా, పారిశ్రామిక రంగంలో వెనుకబడ్డామని, సేవారంగంలో పూర్తిగా వెనుకంజలో ఉన్నామని అన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, వీటన్నింటినీ పరిష్కరించాల్సిన  బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి బాటలు వేయాల్సిన బాధ్యత 15వ ఆర్థిక సంఘానిదేనని, కేంద్రం తప్పులకు రాష్ట్ర ప్రజలను నష్టపరచడం సబబు కాదని, హైదరాబాద్ స్థాయి నగరం నిర్మించాలంటే 20 ఏళ్లు పడుతుందని అప్పుడే చెప్పామని, రూ.5లక్షల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని విభజనకు ముందే చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ నుంచి బైటపడే వరకు ఏపికి ఆర్థిక సంఘమే చేయూత ఇవ్వాలని, ఇంత ఆర్థిక లోటులో కూడా నదుల అనుసంధానం చేశామని, పోలవరం ప్రాజెక్టు 58% పూర్తి చేశామని, 12 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశామని చెప్పారు. రేపు మరో 3 ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్  కల్లా 40 ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని, ఈ విషయాలన్నింటినీ 15వ ఆర్థిక సంఘానికి ఇచ్చే నివేదికలో పొందుపరచాలని, అన్ని అంశాలతో ప్రజంటేషన్ రూపొందించాలని ఆయా అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

రెవిన్యూ డెఫిసిట్ గ్రాంటు, వర్టికల్ డివల్యూషన్,హారిజాంటల్ డివల్యూషన్ తదితర అంశాలలో రాష్ట్రం పరిస్థితి, పొరుగు రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతుల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అక్టోబర్ 9,10,11తేదీలలో ఆర్థిక సంఘం ప్రతినిధులు రాష్ట్ర పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు. 

More Telugu News