s-400: బీ కేర్ ఫుల్.. కఠినమైన ఆంక్షలు విధిస్తాం: ఇండియాకు అమెరికా వార్నింగ్

  • రష్యాతో మిలిటరీ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేస్తే ఆంక్షలు తప్పవు
  • నిన్ననే చైనాపై ఆంక్షలు విధించిన అమెరికా
  • ఎస్-400 లాంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం అమెరికా చట్టాలకు విరుద్ధం

రష్యా నుంచి కొన్ని బిలియన్ల డాలర్లతో ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే తుది చర్చలు పూర్తయ్యాయి. ఈ వ్యవహారంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. భారత్ పై కఠినమైన ఆంక్షలను విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అమెరికా శత్రువులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఇతర దేశాల సంస్థలు, వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కాస్టా)పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన వెంటనే... చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా రక్షణ శాఖకు చెందిన ఎక్విప్ మెంట్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ తో పాటు ఆ సంస్థ డైరెక్టర్ లి షాంగ్ఫుపై ఆంక్షలను విధించింది. రష్యా నుంచి సుఖోయ్-35 ఫైటర్ జెట్లతో పాటు ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లను ఇటీవల రష్యా నుంచి కొనుగోలు చేయడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే, రష్యాను దృష్టిలో పెట్టుకునే ఈ ఆంక్షలను విధిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అమెరికా అధికారి తెలిపారు. ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నైనా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ ఆంక్షలను విధించడం లేదని ఆయన చెప్పారు. రష్యా చర్యలను నియంత్రించేందుకే ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. అమెరికాను, అమెరికా మిత్ర దేశాలను ఇబ్బంది పెట్టేందుకు రష్యా యత్నిస్తోందని విమర్శించారు. ఎస్-400 లాంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం అమెరికా కాస్టా చట్టానికి వ్యతిరేకమని చెప్పారు. చైనాపై ఆంక్షలను విధించడాన్ని ఇతర దేశాలు అర్థం చేసుకోవాలని... రష్యాన్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్ సెక్టార్లతో ఒప్పందాలు చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు.

More Telugu News