Hyderabad airport: ఇక లగేజి బరువు మీరు మోయక్కర్లేదు.. చేతులూపుకొంటూ విమానాశ్రయానికి చేరొచ్చు!

  • మీ సామాన్ల బాధ్యత మాదే అంటున్న హైదరాబాద్‌ విమానాశ్రయం నిర్వాహకులు
  • ‘ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌‘ విధానంతో అమలు
  • స్వల్ప మొత్తం రుసుముతో ఇంటి వద్దే లగేజీ సేకరణ, అప్పగింత

తరచూ విమానాల్లో తిరుగుతుంటారా.. బోలెడంత లగేజీ వెంట తీసుకు వెళ్లాల్సి ఉంటుందా.. ప్రతిసారీ ఈ జంజాటం ఏమిటా? అని విసుక్కుంటున్నారా?.. అయితే ఇకపై మీ కష్టాలకు పుల్‌స్టాఫ్‌ పెట్టేయొచ్చు. చేతులూపుకొంటూ విమానాశ్రయానికి వెళ్లిపోవచ్చు. తిరుగు ప్రయాణంలో కూడా చేతులూపుకొంటూ ఇంటికి వచ్చేయచ్చు. మీ లగేజీ మీకు భద్రంగా విమానాశ్రయానికి లేదా మీ ఇంటికి చేరిపోతుంది!

అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? హైదరాబాద్‌ విమానాశ్రయం నిర్వాహకులు ‘ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌‘ విధానంతో లగేజీ సేవల నిర్వహణను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం బెంగళూరుకు చెందిన ‘క్వార్టర్‌ ఎక్స్‌’ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో విమాన ప్రయాణ సమయంలో మీరు చేయాల్సిందల్లా సదరు సంస్థ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో ప్రయాణ తేదీ, సమయం (పికప్‌ ఆర్‌ డెలివరీ) బుక్‌ చేసుకుంటే చాలు. సదరు సంస్థ సిబ్బంది మీ ఇంటికే వచ్చి లగేజీని ప్యాక్‌ చేసి విమానాశ్రయానికి చేరుస్తారు. తిరుగు ప్రయాణమైతే విమానాశ్రయం నుంచి లగేజీ తెచ్చి మీ ఇంటికి అప్పగిస్తారు.

ఇందుకోసం బరువును బట్టి రుసుము వసూలు చేస్తారు. లగేజీ బుక్‌ చేసుకున్నప్పుడే ప్రయాణికుని మెయిల్‌, ఫోన్‌ నంబర్‌కు పోర్టర్‌, ఇతర వివరాలు అందిస్తారు. లగేజీకి ఉన్న బార్‌ కోడ్‌ ఆధారంగా అది ఎక్కడ ఉందో ట్రాక్‌ చేసి చూసుకోవచ్చు. లగేజీ విషయంలో ఎయిర్‌పోర్టు విధివిధానాలను ప్రయాణికులు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశీయ విమానాల్లో 15 నుంచి 20 కేజీలు, అంతర్జాతీయ విమానాల్లో 23 నుంచి 32 కేజీల లగేజీని మాత్రమే ఉచితంగా అనుమతిస్తున్నారు. అంతకు మించితే చార్జి చెల్లించాలి.

More Telugu News