ikea: 'ఐకియా' రెస్టారెంటులో మరో కలకలం.. చాక్లెట్ కేక్ లో బతికున్న పురుగు!

  • ఐకియా రెస్టారెంటులో ఇటీవలే వెజ్ బిర్యానీలో వచ్చిన గొంగలి పురుగు
  • తాజాగా చాక్లెట్ కేక్ లో ప్రత్యక్షమైన బతికున్న పురుగు
  • రూ. 5 వేల జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు

హైదరాబాదులో ఇటీవలే ప్రారంభమై, వినియోగదారులను ఆకట్టుకుంటున్న స్వీడిష్ ఫర్నిచర్ కంపెనీకి అదే స్థాయిలో ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. అక్కడున్న ఓ రెస్టారెంటులో ఇంతకు ముందు వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇంకా మరచిపోక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

ఈ సారి చాక్లెట్ కేక్ లో బతికున్న ఓ పురుగు కనిపించింది. వివరాల్లోకి వెళ్తే, కిషోర్ అనే కస్టమర్ ఈ నెల 12న ఐకియా రెస్టారెంట్ కు వెళ్లాడు. తన కూతురు కోసం ఓ చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాడు. కేక్ తీసుకొచ్చాక చూస్తే... కేకుపై ఓ పురుగు పాకుతోంది. దీంతో, ఆ పురుగును, ఆర్డర్ కాపీని, బిల్లును వీడియో తీసి మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.

అయితే తన ఫిర్యాదుకు ఎలాంటి స్పందన రాకపోవడంతో... రెండు రోజుల క్రితం మరో వీడియోను కిశోర్ పోస్ట్ చేశాడు. తన ఫిర్యాదు పట్ల ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో, మున్సిపల్ అధికారులు స్పందించి... ఐకియాకు రూ. 5 వేల జరిమానా విధించారు.

ఈ ఘటనపై ఐకియా స్పందించింది. ఐకియా ప్రతినిధి మాట్లాడుతూ, చాక్లెట్ కేక్ లో పురుగు వచ్చినందుకు చింతిస్తున్నామని చెప్పారు. అనుకోకుండా ఇది జరిగిందని, తమను క్షమించాలని కోరాడు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కావని తెలిపారు.

More Telugu News