UGC: సెప్టెంబర్ 29 ఇక 'సర్జికల్ స్ట్రయిక్స్ డే'... కేంద్రం ఆదేశం!

  • పాక్ పై సర్జికల్ దాడులు జరిగి రెండేళ్లు
  • పాకిస్థాన్ ను భయాందోళనలకు గురిచేసిన నాటి దాడి
  • గుర్తుగా చర్చలు, పెరేడ్లు చేపట్టాలన్న యూజీసీ

దాదాపు రెండు సంవత్సరాల క్రితం పాక్ ఆక్రమిత కశ్మీరులోకి చొరబడిన భారత సైన్యం చేసిన లక్షిత దాడులు గుర్తున్నాయా? పాకిస్థాన్ ను తీవ్ర భయాందోళనలకు గురి చేసిన ఈ ఆపరేషన్ పై ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అత్యంత రహస్యంగా జరిపిన ఈ సర్జికల్ స్ట్రయిక్స్ ను జాతి యావత్తూ సమర్థిస్తూ, సైన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. మరో వారం రోజుల్లో సర్జికల్ స్ట్రయిక్స్ జరిపి రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న లక్షిత దాడుల దినం (సర్జికల్ స్ట్రయిక్స్ డే)ను జరుపుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు యూనివర్శీటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు ఇస్తూ, అన్ని యూనివర్శిటీలు, విద్యాసంస్థలూ సర్జికల్ స్ట్రయిక్స్ డేను జరుపుకోవాలని పేర్కొంది. సాయుధ దళాల త్యాగాల గురించి మాజీ సైనికాధికారులతో చర్చా కార్యక్రమాలు పెట్టించాలని, సైన్యానికి మద్దతు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులను పంచాలని, ఎస్సీసీ కేడెట్లతో ప్రత్యేక కవాతులు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, నగరాలు, పట్టణాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది.

More Telugu News