Chinthamaneni Prabhakar: యూనియన్ నాయకుడిని కొట్టిన సంఘటనలో.. ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీస్‌ కేసు నమోదు!

  •  ముగ్గురు భద్రతా సిబ్బంది, మరో ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు
  • ఐఎంఎల్‌ డిపో కార్మిక సంఘం నేత జాన్ పై దాడి ఎఫెక్ట్‌
  • ప్రజా సంఘాల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు 

కార్మిక సంఘం నాయకుడిని కొట్టడమే కాక అనుచరులు, భద్రతా సిబ్బందితో దాడిచేయించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎట్టకేలకు కేసు నమోదైంది. బాధితుడైన రాచీటి జాన్‌ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతో ఇఫ్టూ, పలు ప్రజా సంఘాలు ఆందోళనలు, రిలే దీక్షలకు దిగిన విషయం తెలిసిందే. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు దిగివచ్చారు.

ఏలూరులోని ఐఎంఎల్‌ డిపోలో పనిచేస్తున్న గొర్రెల శ్యాంబాబు ఈనెల 7న మద్యం సీసా దొంగిలించి దొరికిపోవడంతో, యూనియన్ నిబంధనల ప్రకారం అతన్ని పనిలోంచి తొలగించారు. రాంబాబు బావమరిది చుక్కా ఈశ్వరరావు కూడా అక్కడే పని చేస్తున్నాడు. ఇతను స్థానిక టీడీపీ నాయకుడు నేతల రవి ద్వారా తన బావను తొలగించిన విషయాన్ని ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకువెళ్లాడు.

దీంతో ఈనెల 10న యూనియన్ నాయకుడు జాన్‌ని ఇంటికి పిలిపించిన ఎమ్మెల్యే.. రాంబాబును పనిలో పెట్టుకోవాలని ఆదేశించారు. అందుకు నిబంధనలు అంగీకరించవని జాన్‌ కరాఖండీగా చెప్పేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే జాన్‌పై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న నేతల రవి, చుక్కా ఈశ్వరరావుతో పాటు ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా జాన్‌పై దాడి చేశారు. దీనిపై బాధితుడు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో దిగివచ్చిన ఏలూరు మూడో పట్టణ పోలీసులు గురువారం చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

More Telugu News