goddess durga: ఇకనుంచి బెజవాడ దుర్గమ్మ ప్రసాదంగా అప్పాలు!

  • పులిహోర స్థానంలో అప్పాల పంపిణీ
  • అమ్మవారికి నైవేద్యంగా పొంగలి, అప్పాలు
  • ఒక్కో అప్పం తయారీకి రూ.4 ఖర్చు

ఒక్కో దేవుడికి ఒక్కో ప్రసాదం ప్రత్యేకం. తిరుపతి, అన్నవరం, శబరిమలై తదితర పుణ్యక్షేత్రాలన్నీ వేటికవే ప్రసాదం విషయంలో ప్రత్యేకం. అలాగే ఇప్పటి వరకూ బెజవాడ దుర్గమ్మ ప్రసాదంగా లడ్డు ఉండేది. అలాగే అమ్మవారి భక్తులకు పులిహోర పంపిణీ చేస్తున్నారు. కానీ అమ్మవారికి బియ్యం, బెల్లంతో చేసిన వంటకాలు నైవేద్యంగా సమర్పించటం ఆనవాయితీ. దీనిలో భాగంగా పొంగలి, అప్పాలను నిత్యం అమ్మవారికి సమర్పిస్తుంటారు.

అయితే పులిహోర స్థానంలో భక్తులకు ఇకపై అప్పాలను ప్రసాదంగా పంపిణీ చేయాలని దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. ఒక్కో అప్పం తయారీకి రూ.4 చొప్పున ఖర్చవుతుంది. అమ్మవారి దర్శనానికి సాధారణ రోజుల్లో అయితే 25 వేలు, శుక్ర, ఆదివారాల్లో అయితే దాదాపు 40-50 వేల మంది భక్తులు వస్తుంటారు. ఈ లెక్కన ఏడాదికి అప్పాల తయారీకి రూ.3 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ విషయంపై తీర్మానించారు. అక్టోబర్ 10 నుంచి జరిగే దసరా ఉత్సవాల నుంచి ఈ ప్రసాద వితరణకు శ్రీకారం చుట్టనున్నారు. అమ్మవారికి ప్రసాదాలు తయారు చేసే వంటస్వాములే అప్పాలను కూడా తయారు చేయనున్నారు.  

More Telugu News